అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ‘బండి’

Karimnagar Mayor Sunil Rao Slams On Bandi sanjay - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఎంపీ గారూ.. కరోనా కట్టడికి కేంద్రం నుంచి రూ.7 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారు అవెక్కడ ఉన్నాయో చూపించాలని మేయర్‌ వై.సునీల్‌రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి తెలంగాణకు రూ.290 కోట్లు కేటాయించామని వెల్లడించారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ యువతను రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్రం రూ.800 ఇస్తోందని తప్పుడు ప్రచారం చేసి, ఓట్లు దండుకున్నాడని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ది మీరేనని, గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ చొరవతోనే స్మార్ట్‌సిటీతో పాటు జాతీయ రహదారులు వంటి ఎన్నో పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎంపీ కోటా నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు తీసుకురావడంలో, అభివృద్ధి పనులు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ బిల్లులు పేద ప్రజలకు, రైతాంగానికి గుదిబండగా మారనున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో బీజేపీపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, కాశెట్టి లావణ్య, బండారి వేణు, ఐలేందర్‌ యాదవ్, చాడగొండ బుచ్చిరెడ్డి, తోట రాములు, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, నాంపెల్లి శ్రీనివాస్, తాడెపు శ్రీదేవి, నేతికుంట యాదయ్య, కుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.   

అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ‘బండి’
చొప్పదండి: ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.200 కోట్లు ఇచ్చామని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటిస్తే, రూ.7వేల కోట్లు ఇచ్చారని ఎంపీ పేర్కొనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధుల మంజూరుపై జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. ఎంపీగా గెలిచి, కరీంనగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి ఇప్పించి, నిజమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనిపించుకోవాలని సూచించారు. ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్‌ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top