Kapil Sibal: అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది.. కపిల్‌ సిబల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Kapil Sibal Explanation On Quitting Congress Party - Sakshi

న్యూఢిల్లీ: ముప్ఫై ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌. సమాజ్‌ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్‌ దాఖలు చేసి.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్‌ను వీడడంపై కపిల్‌ సిబల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. పార్లమెంట్‌లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం.

ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అని కపిల్‌ సిబల్‌ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, తానేమీ తమాషా చేయదల్చుకోలేదని, సంకేతాలు ఇచ్చినా ముందస్తుగా ఎవరికీ తెలియకపోవడం అనేది తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు.

ఇదిలా కాంగ్రెస్‌ రెబల్‌ గ్రూప్‌ జీ-23లో కపిల్‌ సిబల్‌ కూడా ఉండేవారు. గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం కూడా వినిపించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన కపిల్‌ సిబల్‌.. సీనియర్‌ లాయర్‌గా, న్యాయ నిపుణుడిగా కాంగ్రెస్‌ లీగల్‌ వింగ్‌ను పర్యవేక్షించారు కూడా. ఆయన నిష్క్రమణతో ఒకరకంగా కాంగ్రెస్‌ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి: అంతా ఒక్కతాటిపైకి రావాలి-కాంగ్రెస్‌ను వీడాక కపిల్‌ సిబల్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top