పాక్‌ నేత వీడియో: రాహుల్‌ గాంధీపై నడ్డా విమర్శలు

JP Nadda Says Hopefully Rahul Gandhi Sees Light Pak Leader Video - Sakshi

న్యూఢిల్లీ: భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజల పట్ల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హితవు పలికారు. రాహుల్‌ ఎంతగానో విశ్వసించే దేశమైన పాకిస్తాన్‌కు చెందిన నేత మాటలైనా ఆయన కళ్లు తెరిపిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ఇకనైనా భారత ఆర్మీని తక్కువ చేసి మాట్లాడే రాజకీయాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్‌ ప్రతిపక్ష నేత అయాజ్‌ సాదిఖ్‌ బుధవారం నేషనల్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. అభినందన్‌ వర్ధమాన్‌ విడుదల నాటి పరిస్థితులను గుర్తుచేసిన విషయం తెలిసిందే. విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్‌ విడుదల చేయడమే తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పినట్లు ఆయాజ్‌ పేర్కొన్నారు.(చదవండి: అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్‌ నేత)

అదే విధంగా భారత్‌ ప్రతీకారానికి సిద్ధమవుతుందని, వెంటనే భారత వింగ్‌ కమాండర్‌ను విడుదల చేయాలన్నారని, ఆ సమయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా భయంతో వణికిపోయారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన జేపీ నడ్డా, కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘మన దేశ ఆర్మీని బలహీనమైనదిగా చూపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి తెరతీసింది. సాయుధ దళాలలను, వారి ధైర్యసాహసాలను విమర్శించే విధంగా మాట్లాడింది. అంతేకాదు రఫేల్‌ జెట్లు భారత్‌లో ల్యాండ్‌ కాలేవంటూ ప్రచారం చేసింది. ఇలాంటి రాజకీయాలను భారత ప్రజలు తిప్పికొట్టారు. ఓటమి రూపంలో వారికి శిక్ష విధించారు. భారతీయులను, భారత ఆర్మీని, ప్రభుత్వాన్ని నమ్మని కాంగ్రెస్‌ పార్టీ, వాళ్లకు ఎంతో విశ్వాసపాత్రమైన పాకిస్తాన్‌ వల్లనైనా కళ్లు తెరుస్తోందేమో.. ఇప్పుడైనా రాహుల్‌ గాంధీ కాస్త కళ్లు తెరవండి’’అని చురకలు అంటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top