జీవన్‌రెడ్డిని శాలువాతో సత్కరిస్తున్న కేటీఆర్
సీనియర్ నేత జీవన్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌తో కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
కేసీఆర్ సూచనల మేరకే పార్టీలోకి ఆహ్వానించామన్న కేటీఆర్
జగిత్యాల: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం భావోద్వేగానికి గురిచేసినప్పటికీ బీఆర్‌ఎస్‌తో కలవడం సంతోషంగా ఉందన్నారు. గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చారు. వారిని జీవన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ నేతలతో భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ జగిత్యాలకు వచ్చి తనను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాభిప్రా యం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. 20 నెలలుగా ఎన్నో అవమానాలు తట్టుకుని ఓపికగా ఉన్నానన్నారు. తాను అనేక ప్రభుత్వాలను చూశానని, ప్రస్తుత ప్రభుత్వం తిరోగమన దిశలో కొనసాగుతోందని విమర్శించారు.
కేసీఆర్, జీవన్‌రెడ్డిది గొప్ప స్నేహం: కేటీఆర్
కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడానికి వచ్చినట్లు తెలిపారు. జీవన్‌రెడ్డి ప్రజా నాయకుడు అని, రైతులు, ప్రజల కోసం నిత్యం పోరాడే వ్యక్తి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన జీవన్‌రెడ్డి అక్క డ ఎన్నో అవమానాలకు గురయ్యారని చెప్పారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ నిబద్ధత గల నాయకుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలో పేతం కోసం అక్కడే కొనసాగారని చెప్పారు. కేసీఆర్, జీవన్‌రెడ్డికి మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉందన్నారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కరీంనగర్‌లో జరిగిన సభకు జీవన్‌రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా వచ్చి బోర్నపల్లి బ్రిడ్జి మంజూరు చేయాలని కోరగా కేసీఆర్ వెంటనే రూ.75 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని అసెంబ్లీలో కోరగా, కో–ఆపరేటీవ్ వ్యవస్థ బాగుంటుందని, దానికి మీరే చైర్మన్‌గా ఉండాలంటూ కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని తెలిపారు.
కేసీఆర్‌ను కలిసిన తర్వాత చేరికపై ప్రకటన!
జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించామని, కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీలో చేరికకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కేటీఆర్ చెప్పారు. జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల పాలనలో అంతా వైఫల్యమేనని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కి.. ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారని, ఇందుకు జీవన్‌రెడ్డి సహకారం కోరుతున్నామని చెప్పారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎల్.రమణ, వినోద్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తదితరులు కేటీఆర్ వెంట ఉన్నారు.


