కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది: మహేశ్‌ గౌడ్‌ | Mahesh Goud Comments on Jeevan Reddy: Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చింది: మహేశ్‌ గౌడ్‌

Apr 10 2026 12:53 AM | Updated on Apr 10 2026 5:11 AM

Mahesh Goud Comments on Jeevan Reddy: Telangana

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ 14 సార్లు బీ–ఫామ్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయంగా మారుతున్న పరిస్థితులను బట్టి నాయకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని చెప్పడం సరికాదని, ఆయన్ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌పై విమర్శలు చేసే ముందు గతంలో బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని, భవిష్యత్‌లో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, ఆధారాలు ఉంటే గాంధీభవన్‌కు తీసుకురావాలని సవాల్‌ విసిరారు. ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని, నిరాధార ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. నాదర్‌గుల్‌ భూముల వ్యవహారం బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ చేసిన దోపిడీపై ప్రజలకు ఇప్పటికే అవగాహన వచ్చిందన్నారు. మంత్రి వర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని, సమీప కాలంలో విస్తరణ ఉండదనే అనుకుంటున్నట్టు తెలిపారు. తనతోపాటు పలువురు నాయకులు ఎన్‌ఎస్‌యూఐ నుంచే ఎదిగినవారేనని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, శంకర్‌నాయక్‌ తదితరులు కూడా ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చినవారేనని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement