కాళేశ్వరం బరాజ్‌లకు వెంటనే మరమ్మతులు | Telangana CM Revanth Reddy orders action plan for Kaleshwaram repairs | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం బరాజ్‌లకు వెంటనే మరమ్మతులు

Apr 10 2026 12:34 AM | Updated on Apr 10 2026 12:34 AM

Telangana CM Revanth Reddy orders action plan for Kaleshwaram repairs

కాళేశ్వరంపై సమీక్షలో సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు

ప్రత్యేక కార్యాచరణను రూపొందించి పర్యవేక్షించాలన్న సీఎం.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ప్రాజెక్టుపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌లకు సత్వరమే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)  ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, బరాజ్‌ల నిర్మాణ సంస్థలు, డిజైన్‌ కన్సల్టెంట్‌తో టీమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పనిలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఉండేలా చూడాలన్నారు.

మేడిగడ్డ పనులపై పూర్తి షెడ్యూల్‌ రూపొందించండి
మేడిగడ్డ బరాజ్‌ దగ్గర 500 బోరు హోల్స్‌ తవ్వాల్సి ఉందని,   ఇందుకోసం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకుని వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని చెప్పారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్‌ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్‌ సిద్ధం చేయాలని, నిధుల సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. బరాజ్‌ వద్ద బేస్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా  1.6 కిలోమీటర్ల మేడి గడ్డ బరాజ్‌ పటిష్టతపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువ చ్చారు. సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement