గులాబీ బాస్‌ మదిలో ఏముంది.. ఆ సీనియర్‌ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా?

Impact of Caste Politics In Bhadradri Kothagudem District - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాలూ షెడ్యూల్డు తెగలకు రిజర్వు చేసినవే. ఆదివాసులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కావడంతో వీటిని వారికే రిజర్వు చేశారు. అటవీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి. కాలక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడి కాంగ్రెస్‌, టీఆర్ఎస్ హవా ఎక్కువైంది. జిల్లా కేంద్రం భద్రాచలం కూడా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది.
చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్‌?

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులే 8 సార్లు విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నా భద్రాచలం రూరల్ ప్రాంతాలు ఏపీలో కలవడంతో సీపీఎం హవా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పోదెం వీరయ్య మళ్ళీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. అంతకుముందు మూడు సార్లు విజయం సాధించిన సీపీఎం నేత సున్నం రాజయ్య గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు గాని కుమార్తె గాని బరిలో నిలబడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వచ్చే ఎన్నికల్లో పినపాక వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అటు బీజేపీ సైతం భద్రాచలం ఫై ఫోకస్ పెట్టింది. కుంజా సత్యవతిని బరిలో దించాలని కమలం పార్టీ భావిస్తోంది.

రెండు పార్టీలు బలంగానే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. జనరల్ సెగ్మెంట్‌ కావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కులాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో జలగం వెంకట్రావు కారు గుర్తు మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో  ఓటమి పాలయ్యారు.

తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వనమా వెంకటేశ్వరరావు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో కొత్తగూడెంలో టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. చాలాకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న వనమా, జలగం ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో జలగం వెంకట్రావు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం ప్రచారాన్ని ఖండిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే జలగం వెంకట్రావు అధికార పార్టీ కార్యక్రమాలకు  మాత్రం దూరంగానే ఉంటున్నారు.

ఈ ఏడాది జనవరిలో పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్య ఘటనతో వనమా వెంకటేశ్వరరావు అప్రదిష్టపాలయ్యారు. ఆయన కుమారుడు రాఘవ వల్ల ఎమ్మెల్యే గిరీ పోతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో వేడి చల్లారింది. ఈ ఘటన తర్వాత వనమాకు ప్రాధాన్యం తగ్గి, తిరిగి జలగం వెంకట్రావుకు టిక్కెట్‌ ఇస్తారనే ఊహాగానాలు సాగాయి.

అయితే పార్టీలో అటువంటి మార్పు జరుగుతుందనే సూచనలేమీ కనిపించడంలేదు. సీనియర్ నేతగా ఉన్న జలగంకు పార్టీ ప్రయార్టీ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్‌వచ్చే అవకాశం లేకపోతే పాత ఇల్లు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో జలగం ఉన్నట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు గులాబీ బాస్‌ కూడా జలగం వెంకట్రావును పొమ్మనలేక పొగబెడుతున్నారని చర్చించుకుంటున్నారు. 

మూడు గ్రూపులుగా విడిపోయి..
కాంగ్రెస్ విషయానికి వస్తే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టిక్కెట్‌ఆశిస్తున్న ముగ్గురు నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు సైతం మూడు గ్రూపులుగా చీలిపోయి చేస్తున్నారు. బీజేపీ కొత్తగూడెం ఇన్‌చార్జ్‌గా కొనేరు చిన్ని కొనసాగుతున్నారు. ఆయన పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవంలేదు. ఫేస్‌వాల్యూ ఉన్న నాయకులు లేకపోవడమే బీజేపీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని చెప్పవచ్చు.

కోల్డ్ వార్..
ఎస్టీ నియోజకవర్గమైన పినపాకలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ పార్టీ ఏదైనా అభ్యర్థుల గెలుపు ఓటములపై గిరిజనుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలు పోడు భూములను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార బరిలో దిగుతుంటాయి. ఎన్నికల లోపు పోడు భూముల సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. లేదంటే ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌నేత రేగా కాంతరావు పోటి చేసి గెలుపోందారు. గెలిచిన తర్వాత రేగా కాంతరావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేగా కాంతారావు వ్యవహరిస్తున్నారు. రేగా  టీఆర్ఎస్‌లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కోల్డ్ వార్ నడుస్తోంది.

రేగా కాంతరావు టీఆర్ఎస్‌లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు నాయకుడు లేకుండా పోయారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పినపాకలో సైతం తరచుగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోదెం వీరయ్యను పినపాక నుంచి బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కారు పార్టీలో అసంతృఫ్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

ఇల్లెందు నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోట. సీపీఐ ఎంఎల్ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం గెలిచింది. కాని ఇప్పటికీ ఇల్లెందులో వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గంలో సైతం పోడు భూముల సమస్య తీవ్రంగానే ఉంది. గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఇక్కడ హరిప్రియ, కోరం కనకయ్య ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు.

2014లో కనకయ్య కాంగ్రెస్‌తరపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్‌తరపున పోటీ చేయగా..కనకయ్య టీఆర్ఎస్‌నుంచి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్‌అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. మొత్తం మీద ఎంఎల్‌పార్టీ కంచుకోటలో కాంగ్రెస్‌పాగా వేసింది. అయితే హరిప్రియ గెలిచిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే టాక్‌నడుస్తోంది.

అశ్వారావుపేటలో రసవత్తర పోరు..
అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్యే పోటీ జరగబోతోంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు తర్వాత అందరితో పాటు కారు పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి గులాబీ గూటిలో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే తాటి వెంకటేశ్వర్లుకు గులాబీ టిక్కెట్‌ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో కారు  దిగి హస్తం గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ... తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్‌ మీద హాట్‌ కామెంట్స్‌ చేశారు తాటి వెంకటేశ్వర్లు. అయితే గెలిచినా గెలవకపోయినా గ్రూప్‌లు కట్టడంలో ముందుండే కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో గ్రూప్‌ తయారైంది. ముగ్గురు నాయకులు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే ప్రధాన పోటీ జరగబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు ఈ మధ్యన ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీని గురించి పట్టించుకోకపోవడంతో ఆదివాసుల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఒకవైపు పోడు భూముల వివాదం, మరికొన్ని సంఘటనలు అటు ఎమ్మెల్యేకు..ఇటు అధికార పార్టీకి సమస్యగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ పేరుకు ఉంది గాని.. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top