Huzurabad Bypoll: మాటల యుద్ధం ముగిసింది

Huzurabad Bypoll: High Octane Campaign End on Wednesday Evening - Sakshi

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పార్టీల ప్రచారం సమాప్తం

దూకుడుగా వ్యవహరించిన అధికార టీఆర్‌ఎస్‌ 

తొలుత గంగుల, ఆ తర్వాత రంగంలోకి హరీశ్‌రావు 

బీజేపీ నుంచి బరిలో ఉన్న ఈటలకు ప్రతిష్టగా మారిన ఎన్నిక 

రాజేందర్‌కు అండగా కమలదళం.. విస్తృతంగా ప్రచారం 

అభ్యర్థి ప్రకటనలోనే కాంగ్రెస్‌ జాప్యం 

మెల్లగా ప్రచారంలోకి ముఖ్య నేతలు 

విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిన రాజకీయం 

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 4 నెలలు సాగిన ప్రచార పర్వం

సాక్షి, హైదరాబాద్‌:  సవాళ్లు, ప్రతిసవాళ్లు.. విమర్శలు, ఆరోపణలు.. ఆత్మీయ ఆలింగనాలు, ప్రమాణాల డిమాండ్లతో హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారానికి బుధవారం సాయం త్రం తెరపడింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నాలుగు నెలల పాటు ప్రచార పర్వం సాగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా మొదలు హుజూరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది.

ఓ వైపు ఈటల వర్గం, మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతలు మోహరించారు. హుజూరాబాద్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కాస్త ఆల్యసంగా బరిలోకి దిగినా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మూడు ప్రధాన పక్షాలు కూడా పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి.. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ స్థాయిలో నేతలకు బాధ్యతలు అప్పజెప్పి ప్రచారం నిర్వహించాయి. మొత్తంగా ప్రచార హోరు ముగియడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే చర్చ మొదలైంది. 

అన్ని అస్త్రాలతో టీఆర్‌ఎస్‌.. 
పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్‌తో తలపడాల్సిన పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ స్థానిక నాయకత్వం చేజారకుండా, ఈటల పక్షాన వెళ్లకుండా మంత్రి గంగుల కమలాకర్‌ను రంగంలోకి దింపింది. తర్వాత ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించింది. వెంటనే బరిలో దూకిన హరీశ్‌రావు అటు పార్టీ కేడర్‌ను కాపాడటంతోపాటు ప్రచారాన్ని ఉధృతం చేయడంపై దృష్టి సారించారు.

ఈటలది పైచేయి కాకుండా వ్యూహాలు పన్నుతూ.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆయనకు తోడు పలువురు మంత్రులు, కరీంనగర్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వివిధ కులాల నేతలు కూడా హూజూరాబాద్‌ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తంగా ప్రచారపర్వంలో టీఆర్‌ఎస్‌ దూకుడుగా వ్యవహరించిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 

దీటుగా బరిలో ఈటల 
హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న ఆదరణ, తన వెంట నడిచిన అనుచరులనే నమ్ముకుని బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు.. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోడైంది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్‌ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి వంటి నాయకులు వెన్నంటి నిలవడంతో టీఆర్‌ఎస్‌కు దీటుగానే ఈటల ప్రచారాన్ని హోరెత్తించారు.

టీఆర్‌ఎస్‌లో అవమానాలు భరించలేకనే బయటికి వచ్చానంటూ ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రజల నుంచి సానుభూతి కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలనలో విఫలమైందని, కుటుంబ పాలన జరుగుతోందని విమర్శలు గుప్పించారు. 

శక్తిమేర కాంగ్రెస్‌.. 
మరో ప్రధాన పక్షం కాంగ్రెస్‌ కూడా శక్తిమేర ప్రచారం నిర్వహించింది. మొదట అభ్యర్థి ఎంపికలో జాప్యం చేసిన ఆ పార్టీ.. విద్యార్థి సంఘం నేత బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపింది. ఆయనకు మద్దతుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు తొలి నుంచీ నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు. 

కుల సంఘాలు.. దళిత బంధు 
హుజూరాబాద్‌ నియోజకవర్గ స్వరూపానికి అనుగుణంగా ఈ ఉప ఎన్నికలో కుల సంఘాలు, దళితబంధు పథకం కీలకం కానున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా కుల సంఘాలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. నియోజకవర్గంలో మొత్తంగా 2.37 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 1.7 లక్షల ఓట్లు ప్రధానమైన ఏడు సామాజిక వర్గాలవారే ఉన్నారు. మాదిగ, మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, యాదవ, రెడ్డి, మాల సామాజికవర్గాలకు తోడు ఇతర వర్గాలనూ ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నారు. 

ఇక ఈ ఎన్నికల్లో విస్తృత చర్చకు దారితీసిన దళితబంధు పథకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్‌ ఆగస్టు 16న నియోజకవర్గానికి వెళ్లి దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. తర్వాత సుమారు 16 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమయ్యాయి. కొందరికి ఉపాధి పనులు ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చాయి కూడా. కానీ ఈ పథకాన్ని నిలిపివేయాలని అక్టోబర్‌ 18న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో మిగతావారికి పంపిణీ నిలిచిపోయింది. దళితబంధు ఆగేందుకు మీరంటే మీరే కారణమంటూ పార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. 

భారీ ఖర్చు.. ప్రలోభాలు! 
హుజూరాబాద్‌లో దాదాపు నాలుగు నెలల నుంచి ప్రచారం సాగుతోంది. ఇంతకాలంగా పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం, అదే సమయంలో మరింత మందిని కూడగట్టుకోవడం అభ్యర్థులకు భారంగానే మారిందన్న అభిప్రాయముంది. రోజూ ప్రచార ఖర్చు, కార్యకర్తలకు బస, భోజన ఏర్పాట్లు, మద్యం, మాంసంతో విందులు, మధ్యలో వచ్చిన దసరా పండుగ, ఇతర ఏర్పాట్ల కోసం పెద్ద ఎత్తున ఖర్చు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ నెల (అక్టోబర్‌) 1వ తేదీ నుంచి ప్రచారం ముగిసిన బుధవారం వరకు నియోజకవర్గంలో రోజుకు రూ.కోటికిపైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు.. బొట్టుబిళ్లలు, గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు, కోళ్లు, పొట్టేళ్ల పంపిణీ బహిరంగంగానే జరిగింది. తాజాగా ఓటుకు ఐదారు వేల వరకు ఇస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. 

బైపోల్‌ బెట్టింగ్‌! 
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపడం, ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నేపథ్యంలో.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై బెట్టింగ్‌లు జోరందుకున్నట్టు సమాచారం. ఇప్పటికే రూ.100 కోట్లదాకా బెట్టింగ్‌లు కాసినట్టు పందెం రాయుళ్లు చెప్తున్నారు. 

పోలీసుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ‘లెక్క’లివీ.. 
నగదు రూ.3,29,36,830 
 రూ.6,36,052 విలువైన 944 లీటర్ల మద్యం 
 రూ.69,750 విలువైన 11.4 కేజీల గంజాయి 
 రూ.44,040 విలువైన పేలుడు పదార్థాలు  
రూ.2,21,000 విలువైన దుస్తులు 
 రూ.10,60,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు 
ఇక 2,284 మందిని బైండోవర్‌ చేయగా.. 116 కేసులు నమోదయ్యాయి.  

 రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దళితబంధు పథకం, పెట్రోల్‌–డీజిల్‌ పెంపు అంశాలతో టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. 
► టీఆర్‌ఎస్‌ తనను అవమానించిం దంటూ వ్యక్తిగత ప్రతిష్ట పేరిట ఈటల జనంలోకి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విఫల మైందంటూ బీజేపీ నేతలు ప్రచారం చేశారు. 
 బీజేపీ,టీఆర్‌ఎస్‌ ప్రజలనుమోసం చేస్తున్నాయని, వాటికి ప్రత్యామ్నా యం తామేనని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ వచ్చింది.

ఎల్లుండే పోలింగ్‌! 
ఎన్నికల సంఘం కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేసింది. 30న ఉదయం 7గం.కు పోలింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top