Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌కు ‘మైనారిటీ’ బెంగ!

Gujarat Assembly Election 2022: Congress upsets of minority votes - Sakshi

ఆ వర్గం ఓట్లపై కన్నేసిన ఆప్, మజ్లిస్‌

25 స్థానాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కీలకమైన మైనారిటీల ఓట్లను ఒడిసిపట్టేందుకు బీజేపీ మినహా పార్టీలన్నీ ఈసారి సర్వ శక్తియుక్తులూ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాళ్ల ఓట్లను గంపగుత్తగా పొందుతూ వచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ, మజ్లిస్‌ రూపంలో సెగ తగులుతోంది. కొత్తగా రాష్ట్ర బరిలో దిగిన ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఈ రెండు పార్టీల రాకతో ఓటర్లకు కూడా చాయిస్‌ పెరిగిపోయడం ఆసక్తికరంగా మారింది...!

6.5 కోట్ల గుజరాత్‌ జనాభాలో ముస్లింలు దాదాపు 11 శాతం దాకా ఉంటారు. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యముంది. జమ్లాపూర్‌–ఖడియా అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఏకంగా 65 శాతమున్నారు. మిగతా చోట్ల అంతగా కాకున్నా వీరి ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి! రాష్ట్ర ముస్లింలు పాలక బీజేపీకి ఎప్పుడూ పెద్దగా ఓటేసింది లేదు. అందుకు తగ్గట్టే గత రెండు దశాబ్దాల పై చిలుకు కాలంలో ముస్లింలకు బీజేపీ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరుగురు ముస్లింలకు టికెట్లివ్వగా కేవలం ముగ్గురే నెగ్గారు.

2012లో ఏడుగురికి టికెట్లిస్తే ఇద్దరే గెలిచారు! ఈసారి తన ముస్లిం ఓటు బ్యాంకుకు ఆప్, మజ్లిస్‌ గండి కొట్టేలా కన్పిస్తుండటంతో దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పలు చర్యలు చేపట్టింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే మొహమ్మద్‌ పిర్జాదాను నియమించింది. దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కుండాలంటూ అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మైనారిటీల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్‌ జగదీశ్‌ ఠాకూర్‌ కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడేనంటూ ఇతర పార్టీలు ఎంతగా విమర్శించినా లెక్క చేయడం లేదు.

కేజ్రీవాల్, అసద్‌ పర్యటనలు
మరోవైపు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈసారి 30 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ ఇప్పటికే పేర్కొంది. ఆరు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్, మజ్లిస్‌లకు భిన్నంగా ఆప్‌ మాత్రం మైనారిటీల్లోకి చొచ్చుకుపోయేందుకు నిశ్శబ్దంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ముస్లింలకు టికెట్లిచ్చింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ పాలనలోని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తరచూ పర్యటిస్తూ వారి నమ్మకాన్ని చూరగొనేందుకు శ్రమిస్తున్నారు.

ఇవన్నీ రాష్ట్ర మైనారిటీలకు మంచి శకునాలేనంటున్నారు మైనారిటీ కో ఆర్డినేషన్‌ కమిటీ అనే ముస్లిం స్వచ్చంద సంస్థ కన్వీనర్‌ ముజాహిద్‌ నఫీస్‌. ‘‘గత ఎన్నికల దాకా గుజరాత్‌ ముస్లింలకు కాంగ్రెస్‌ మినహా పెద్దగా చాయిస్‌ ఉండేది కాదు. కానీ ఇప్పుడలా లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మజ్లిస్, ఆప్‌లను ముస్లిం ఓటర్లు పెద్దగా పట్టించుకోరని, ఎప్పట్లాగే కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తారని ఆ పార్టీకి చెందిన దరియాపూర్‌ ఎమ్మెల్యే గయాజుద్దీన్‌ షేక్‌ ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీని మించిన హిందూత్వవాదినని పదేపదే రుజువు చేసుకుంటున్నారు. కనుక ముస్లింలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. మజ్లిస్‌కు రాష్ట్రంలో పెద్దగా ఆదరణే లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆప్‌ నేతలు మాత్రం ఢిల్లీ, పంజాబ్‌ ప్రదర్శనను గుజరాత్‌లో పునరావృతం చేస్తామని, మైనారిటీలు కూడా తమనే నమ్ముతున్నారని చెబుతున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top