పచ్చి అబద్ధాలతో దారుణ కథనాలు 

Gadikota Srikanth Reddy Fires On Eenadu And ABN Andhra Jyothi Media - Sakshi

వివేకా హత్యపై ఈనాడు, ఆంధ్రజ్యోతి విష ప్రచారం 

వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి 

దస్తగిరి ఏదో అంటే అది సీబీఐనే చెప్పిందనే తరహాలో కథనాలా? 

వాంగ్మూలమంటూ అందులో లేనివీ రాసేస్తారా? 

ఎదగాలంటే ప్రజల మన్ననలు పొందండి.. దిగజారొద్దు    

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతంపై టీడీపీ అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలతో దారుణమైన కథనాలను ప్రచురించాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడైన దస్తగిరి వాంగ్మూలం అంటూ అందులో లేని విషయాలను కూడా ప్రచురించారని మండిపడ్డారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు చెప్పారు. హత్యకు గురి కావటానికి ఏడాదిన్నర క్రితం ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ వివేకానందరెడ్డి ఓడిపోవటానికి, దస్తగిరి వాంగ్మూలానికి ముడిపెడుతూ కథనాలు వెలువరించడం ఏమిటని ప్రశ్నించారు. దస్తగిరి ఏదో అంటే అది సీబీఐ దర్యాప్తు సంస్థే చెప్పిందనే తరహాలో కథనాలు ఏమిటని నిలదీశారు.


రాజకీయంగా ఎదగాలంటే ప్రజల మన్ననలు పొందాలే కానీ ఇంత దిగజారుడుతనం పనికిరాదన్నారు. తండ్రిని పోగొట్టుకున్నప్పుడు, బాబాయి చనిపోయినప్పుడు రెండు సందర్భాల్లోనూ వైఎస్‌ జగన్‌పై అలాంటి కుట్రలే పన్నారని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. నిత్యం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడం మినహా ప్రజల గురించి, రాష్ట్రం గురించి ప్రతిపక్ష పార్టీ, దాని అనుకూల మీడియా ఆలోచించడం మరచిపోయిందని ధ్వజమెత్తారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు అందుకు అంగీకరించలేదు సరికదా రాష్ట్రానికి సీబీఐ రాకూడదంటూ ఉత్తర్వులిచ్చారని చెప్పారు. సీబీఐ విచారణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించకపోయి ఉంటే అసలు దర్యాప్తు జరిగి ఉండేది కాదన్నారు. ఇందులో కర్ణాటకకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నందున కుటుంబ సభ్యుల కోరిక మేరకు సీబీఐ విచారణకు ఆదేశించారని తెలిపారు. 

ఏదో సీబీఐ చెప్పినట్లుగా కథనాలా? 
టీడీపీ అనుకూల పత్రికలు ఇవాళ తాటికాయంత అక్షరాలతో అసత్యాలు ప్రచురించాయి. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఇందులో ఎలా ఇరికించాలనే ఏకైక అజెండాతో విషం చిమ్మాయి. కుట్రదారులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి అని పెద్దక్షరాలతో ప్రచురించారు. వార్త కింద వివేకానందరెడ్డి డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని రాశారు. ఇది నైతికతా? ఇలాంటి కుట్రలు ఎందుకు? దస్తగిరి చంపినట్లు అంగీకరించినట్లు రాశారు. దస్తగిరికి గంగిరెడ్డి చెప్పాడని కాకుండా ఏదో సీబీఐ చెప్పినట్లుగా ప్రచురించారు.  

ఎవరి పేరైనా చెప్పొచ్చు.. 
ఫలానా వారు ఉన్నారని దస్తగిరికి గంగిరెడ్డి చెప్పాడట! అవతలివారిని ఇరికించాలంటే ఎవరి పేరైనా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పేరు చెప్పొచ్చు, ప్రధానమంత్రి పేరు చెప్పొచ్చు. పూర్తి విచారణ జరగకుండానే ఫలానా వారి ద్వారా  జరిగిందన్న రీతిలో కథనాలు వెలువరించడం ఏమిటి? దీన్ని పట్టుకొని టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లకు దిగుతున్నారు. 

చంద్రబాబు క్యాంపు రాజకీయాలు.. 
టీడీపీ అధికారంలో ఉండగా వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన్ను అత్యంత గౌరవిస్తారు. కొన్ని కారణాలతో కొద్ది రోజుల పాటు పార్టీని విడిచినా తర్వాత తిరిగి వచ్చి జిల్లాలో అన్నీ తానై చూసుకున్నారు. శాసన మండలిలో మంచి వ్యక్తి ప్రాతినిధ్యం ఉండాలని భావించి నాడు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన్ను నిలిపారు. కానీ వివేకానందరెడ్డి గెలిస్తే జిల్లాలో మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ట పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు చేయని కుట్ర లేదు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కడప నుంచి ప్రత్యేక విమానాల్లో పాండిచ్చేరి తరలించి క్యాంప్‌ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూశారు. ఆయన దౌర్భాగ్యపు రాజకీయాలను ప్రజలు మరువరు. అలాంటి నీచానికి ఒడిగట్టి వివేకానందరెడ్డిని చంద్రబాబు ఓడించారు. వివేకా విజయం కోసం ఆనాడు వైఎస్‌ జగన్‌ ఎంతో ప్రయత్నించారు.    
ఆయనన్నారు... ఈయన విన్నారు! 
చంద్రబాబు రాజకీయంగా తుడిచిపెట్టుకుపోయారు. ఇక టీడీపీకి మనుగడ లేదనే భయంతో ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించకుండా వైఎస్సార్‌ కుటుంబంపై బురద చల్లేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యపై నిజాలు బయటకు రావాలని మేం కోరుకుంటున్నాం. పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఎవరో చెప్పారని కాకుండా వాస్తవాలన్నీ బయటకు రావాలి. ఆయనన్నారు... ఈయన విన్నారు అన్నట్లుగా కాకుండా ఆధారాలతో సహా వెలికి తీయాలి.

దోషులకు కఠిన శిక్ష పడాలి. తమ కుటుంబంపై అసత్యాలతో దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డి భావిస్తున్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన దుఃఖంలో మేం ఉంటే తమ పబ్బం గడుపుకునేందుకు అసత్య కథనాలు ప్రచురించినందుకు సిగ్గు పడాలి. ఆ పత్రికలూ రిపోర్టు పూర్తిగా చదవాలి. కావాలంటే మీకు పంపిస్తాం. ఉన్నది ఉన్నట్లు రాస్తే బాగుంటుంది. దిగజారకండి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top