రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు  | Sakshi
Sakshi News home page

రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు 

Published Wed, Oct 6 2021 3:48 AM

UP: FIR Filed Against Priyanka Gandhi 10 Other Congress Leaders For Disturbing Peace - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరిలో రైతు మరణాలపై రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మరో 10 మందిపై శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్లు 144, 151, 107, 116ల కింద కేసులు నమోదు చేసినట్టు మంగళవారం మీడియాకి వెల్లడించారు.

ప్రియాంకతో పాటు ఎంపీ దీపేందర్‌ హుడా, యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ, సందీప్‌ సింగ్‌ తదితరులపై కేసు నమోదైంది. అయితే ప్రియాంకా గాంధీని అదుపులోకి తీసుకొని దాదాపుగా రెండు రోజులవుతున్నా ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచడం కానీ, ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వడంగానీ చేయలేదని కాంగ్రెస్‌ చెబుతోంది. 

అక్రమంగా నిర్బంధించారు: ప్రియాంక  
తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ ప్రియాంకగాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘38 గంటలు గడిచినా నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. మాపై బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు కనీసం లాయర్‌ను కలవనివ్వలేదు. మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచలేదు’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  మరణించిన రైతు కుటుంబ సభ్యులతో ఫోన్‌ ద్వారా ప్రియాంక మాట్లాడారు. లవ్‌ ప్రీత్‌ సింగ్, నక్షత్ర సింగ్‌ బంధువులతో మాట్లాడారు.

వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యక్తిగతంగా వారిని కలుసుకుంటానని ప్రియాంక రైతు కుటుంబాలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్‌ నాయకుడు లలన్‌కుమార్‌ చెప్పారు. ఇదిలా ఉంటే  ప్రియాంకా గాంధీని కలవడానికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ను లక్నో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను విమానాశ్రయం వెలుపలికి రాకుండా నిరోధించారు. దీంతో ఆయన విమనాశ్రయంలోపల నేలపైనే కూర్చొని తన నిరసన తెలిపారు. ‘నన్ను ఎందుకు ఇక్కడ ఆపారు. నేను నిషేధాజ్ఞలు ఉన్న లఖీమ్‌పూర్‌ ఖేరికి వెళ్లడం లేదు. యూపీలో కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళుతున్నాను’ అని బఘేల్‌ అన్నారు.  

లఖీమ్‌పూర్‌ ఖేరిని ముట్టడిస్తాం: సిద్ధూ 
రైతుల మరణాలకు కారణమైన మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్ట్‌ చేసి ప్రియాంక గాంధీని విడుదల చేయాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ డిమాండ్‌ చేశారు. బుధవారంలోగా ప్రభుత్వం ఆ పని చెయ్యకపోతే పంజాబ్‌ కాంగ్రెస్‌ లఖీమ్‌పూర్‌ ఖేరిని ముట్టడిస్తుందని హెచ్చరించారు.  

అసలు సిసలు కాంగ్రెస్‌వాది ప్రియాంక
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తన సోదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక గాంధీ ఎప్పటికీ ఓటమిని అంగీకరించరని, ఆమె అసలు సిసలు కాంగ్రెస్‌వాది అని కొనియాడారు. తాము చేస్తున్న సత్యాగ్రహం ఆగదని అన్నారు. రాహుల్‌ బుధవారం లఖీమ్‌పూర్‌ ఖేరి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

ముగ్గురు రైతులకు అంతిమ సంస్కారం 
ఈ ఘటనలో మరణించిన నలుగురు రైతుల్లో ముగ్గురు లవ్‌ప్రీత్‌ సింగ్, నక్షత్ర సింగ్, దల్జీత్‌ సింగ్‌ల అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే మొహారియా గ్రామానికి చెందిన గుర్వీందర్‌ సింగ్‌ అనే  రైతు కుటుంబం తమకు ఇచ్చిన పోస్టుమార్టమ్‌ రిపోర్టుపై నమ్మకం లేదని, తిరిగి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. గుర్వీందర్‌ను కాల్చి చంపినట్టుగా తమకు అనుమానాలున్నాయని వారు చెప్పారు. దీంతో రెండోసారి పోస్టుమార్టమ్‌ చేయడానికి ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. 

లఖీమ్‌పూర్‌ ఘటనపై న్యాయ విచారణ జరపండి 
లఖీమ్‌పూర్‌ ఘటనపై సీబీఐ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగాలని కోరుతూ సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయవాదులు మంగళవారం ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగాలని, అత్యున్నత స్థాయిలో న్యాయ విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు వారు విన్నవించుకున్నారు. ఈ మేరకు శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. తమ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా పరిగణించి ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకోవాలని లాయర్లు కోరారు.

నిర్దాక్షిణ్యంగా తొక్కించారు
లఖీమ్‌పూర్‌ ఖేరికి ప్రదర్శనగా వెళుతున్న రైతులపై ఎస్‌యూవీ దూసుకుపోయి నలుగురు అన్నదాతలను బలిగొన్న ఘటనకు సంబంధించిన వీడియో బయటకి వచ్చింది. నినాదాలు చేస్తున్న రైతులు మీదుగా అత్యంత వేగంగా వాహనం దూసుకుపోయిన దృశ్యాలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతోంది. రైతులను నిర్దయగా వాహనంతో తొక్కిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

రైతులు ఎస్‌యూవీపై పడటం, బలంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో పక్కకు ఎగిరిపడటం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఈ వీడియోని షేర్‌ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనుద్దేశించి పోస్టు పెట్టారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన మంత్రి కుమారుడిని వదిలేసి, తనను అరెస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించారు. తనలాంటి వారిని కాకుండా నేరం చేసిన వారిని అదుపులోనికి తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకుడు వరుణ్‌ గాంధీ, మరి కొందరు బీజేపీ నేతలు కూడా ఈ వీడియోని షేర్‌ చేశారు.

అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఎవరో ఆ విజువల్స్‌లో స్పష్టంగా తెలియడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాయే కారుని నడుపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తుంటే, ఆ సమయంలో ఆ ప్రాంతంలో తన కుమారుడు లేడని మంత్రి వాదిస్తున్నారు.

అందులో ఆశిష్‌ మిశ్రా ఉన్నాడు 
లఖీమ్‌పూర్‌ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్‌యూవీ (మహీంద్రా థార్‌)లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా అలియాస్‌ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. జగ్జీత్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. ‘రైతుల పైనుంచి నిర్దాక్షిణ్యంగా కాన్వాయ్‌లోని వాహనాలను తీసుకెళ్లిన ఘటన పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది.

మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రైతులు నిరసన ప్రదర్శనలకు దిగారు. బన్‌బీర్‌పూర్‌ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, అజయ్‌ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా నిరసన తెలుపడానికి రైతులు ఆదివారం స్థానిక కాలేజీ మైదానం సమీపంలో గుమిగూడారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆశిష్‌ మిశ్రా 15 నుంచి 20 మంది సాయుధులతో మూడు వాహనాల్లో అక్కడికి చేరుకున్నాడు.

మహీంద్రా థార్‌లో డ్రైవర్‌ పక్కసీట్లో కూర్చున్నాడు. ఈ ఎస్‌యూవీయే తొలుత వేగంగా రైతుల పైనుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిష్‌ కాల్పులు జరిపాడు. నాన్‌పరాకు చెందిన రైతు గుర్విందర్‌ సింగ్‌ ఈ కాల్పుల్లో చనిపోయాడు. రైతుల పైనుంచి దూసుకెళ్లిన వాహనాల నెంబర్లు యూపీ 31 ఏఎస్‌ 1000, యూపీ 32 కేఎం 0036 కాగా... మూడో వాహనం మహీంద్రా స్కార్పియో (నెంబరు తెలియదు)’ అని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. రైతులను తొక్కించుకుంటూ ముందుకెళ్లిన ఆశిష్‌ వాహనం రోడ్డుకు ఓవైపునకు వెళ్లి బోల్తాపడింది.

ఆశిష్‌ వాహనంలో నుంచి బయటపడి తిరిగి కాల్పులు ప్రారంభించాడు. చెరుకు తోటలోకి వెళ్లి దాక్కున్నారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆశిష్‌ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పేరులేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement