Sakshi News home page

'మిత్రకాల్‌'పై పోరాటం.. సత్యమే నా ఆయుధం: రాహుల్ గాంధీ

Published Mon, Apr 3 2023 7:05 PM

This Fight Is Against Mitrakaal Rahul Gandhi After Getting Bail - Sakshi

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్‌ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను పోరాటం చేస్తున్నానని, సత్యమే తన ఆయుధమని పదునైన వ్యాఖ్యలు చేశారు. 'నేను మిత్రకాలంపై పోరాటం చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సత్యమే నా ఆయుధం. అదే నాకు అండ..' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.

హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్నేహితుడు అదానీ కోసమే మోదీ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శల జోరు పెంచిన విషయం తెలిసిందే. అందుకే మోదీ పాలనను మిత్రులకు లాభం చేకూర్చే మిత్రకాల్‌గా ఆయన అభివర్ణిస్తున్నారు.

కాగా.. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో మార్చి 23న రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సోమవారం సూరత్ సెషన్స్‌ కోర్టులో అప్పీల్ చేశారు. తీర్పుపై స్టే విధించాలని, శిక్ష రద్దు చేయాలని కోరారు. 

అయితే న్యాయస్థానం మాత్రం రాహుల్‌కు ఈ కేసులో ఏప్రిల్ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై స్టే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
చదవండి: రాహుల్‌ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్

Advertisement

What’s your opinion

Advertisement