సాక్షి, విశాఖపట్నం: పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని మండిపడ్డారు. స్పీకర్‌గా అయ్యన్న అనర్హుడు.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారని ఆరోపణలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘యువ నాయకుడి పేరు చెప్పుకుని అయ్యన్న వందల కోట్లు దోచుకుంటున్నారు. చోడవరం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడికి ఏం పని? అని ప్రశ్నించారు. స్పీకర్‌గా ఉన్నాననే అయ్యన్న వన్‌సైడ్‌గా వెళ్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆర్డర్‌ను కూడా కూటమి పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాదాయ భూములను కూడా అయ్యన్న వదలడం లేదు. బలిగట్టంలోని వంద ఎకరాల దేవాదాయ భూమిపై అయ్యన్న కన్ను వేశారు. తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి వందల కోట్లు దోచుకుంటున్నారు.
నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?. రైతులకు అన్యాయం జరుగుతుంటే కోర్టుకు వెళ్తే నేను హిందూ వ్యతిరేకినా?. కోర్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్తే మా పై దాడి చేశారు. ల్యాటిరైట్ మీద ఇప్పటి వరకు 400 కోట్లు సంపాదించారు. కొడుకుకు రాజ్యసభ సీటుకోసం అమరావతి నాయకుడుకు కోట్లాది రూపాయలు ఇస్తామని చెపుతున్నారు. రోలుగుంటలో క్వారీల దగ్గర అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. 100 ఎకరాల దేవాలయ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు. కొడుకు ప్రమోషన్ కోసం ప్రభుత్వ చెరువులో సృష్టి క్షేత్రం కడుతున్నారు. దానికి నిధులు GMR నుంచి తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా.. సృష్టి క్షేత్రంలో పనులు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో అయ్యన్నకు తిరిగి ఇస్తాము. అయ్యన్న, కలెక్టర్, పోలీసుల మీద కోర్టుకు వెళ్తాం’ అని హెచ్చరించారు.
మరోవైపు.. నాయకులు కేకే రాజు మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్న పాత్రుడు విష సంస్కృతిని తీసుకువచ్చారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తే చంపడానికి ప్రయత్నం చేశారు. రౌడీలు గుండాలతో భౌతిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ అయ్యన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు కూటమి నేతలకు బానిసల్లా పని చేయడం మానుకోవాలి. కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని తెలిపారు.


