నేడు నడ్డాతో ఈటల భేటీ..రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ | Etela Rajender Meet With Jp Nadda | Sakshi
Sakshi News home page

నేడు నడ్డాతో ఈటల భేటీ..రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

May 31 2021 3:40 AM | Updated on May 31 2021 4:36 AM

Etela Rajender Meet With Jp Nadda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈటల బీజేపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో.. ఆయన ఉన్నట్టుండి శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యక్షం కావడం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయనతో పాటు ఉండటం, బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు కూడా సోమవారం హస్తిన ప్రయాణం పెట్టుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కలిసి ఈటల సోమవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారని, వీలుంటే అమిత్‌ షాను కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే సోమవారం బీజేపీలో చేరిక కార్యక్రమం ఉండకపోవచ్చని, కొన్ని విషయాలపై స్పష్టమైన హామీలు తీసుకుని హైదరాబాద్‌ తిరిగి వస్తారని సమాచారం. స్పష్టమైన హామీలు లభిస్తే, ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించి బీజేపీలో అట్టహాసంగా చేరేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది. 

కేవలం భేటీలే..
విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం ఉదయం 11 గంటలకు నడ్డాతో ఈటల భేటీ అవుతారు. తనకు రాజకీయ రక్షణ కల్పించడంతో పాటు, తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపైనా చర్చిస్తారు. బీజేపీ అధిష్టానం నుంచి ఈ మేరకు స్పష్టమైన హామీలు పొందాకే తాను ఎప్పుడు రాజీనామా చేయాలి? ఎప్పుడు బీజేపీలో చేరాలన్న అంశాలపై నియోజకవర్గ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరవర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌లాంటి బలమైన నేతను తట్టుకోవాలంటే తనకు బలమైన పార్టీ అండ కావాలన్న ఆలోచనలతోనే బీజేపీలో చేరేందుకు ఈటల సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇదివరకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో ఈటల ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీనిపై జాతీయ పార్టీ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో ఈటలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన ఈటల సోమవారం కుదిరితే హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. 

నేడు ఢిల్లీకి బీజేపీ నేతలు 
సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. అయితే కిషన్‌రెడ్డికి ఇక్కడ కోవిడ్‌ బాధితులకు బియ్యం, నిత్యావసరాల పంపిణీని పరిశీలించే కార్యక్రమం ఉందని, ఈ కార్యక్రమం ముగించుకుని ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం. మాజీ ఎంపీ వివేక్‌ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు.  

తెలంగాణ భవన్‌ నజర్‌
ఈటల ఢిల్లీ వెళ్లిన నేఫథ్యంలో ఆయన కదలికలపై తెలంగాణ భవన్‌ దృష్టి సారించింది. ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్లారు? బీజేపీకి చెందిన ఏయే నేతలను కలుస్తారన్న అంశంపై అటు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి ఇటు క్షేత్రస్థాయి పార్టీ నాయకుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాగా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలు పార్టీలో కొనసాగాల్సిన అవసరాన్ని ముగ్గురు నాయకులు వివరించడంతో పాటు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement