కేసీఆర్‌ ఎవ్వరినీ వదిలిపెట్టడు!

Etela Rajender Comments On CM KCR - Sakshi

ఇవాళ నాకు జరిగింది.. రేపు మీకు.. 

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ 

కమలాపూర్‌: ‘ఎక్కడ కూడా నేను పద్ధతి తప్పలేదు, నేనొక్కడినే కాదు.. నాలాగ మంత్రులుగా ఉన్న వాళ్లు కూడా కొందరు పద్ధతి తప్పలేదు. ఇవాళ నాకు జరిగింది.. రేపు వాళ్లకు జరిగే ఆస్కారం ఉంటది తప్ప కేసీఆర్‌ ఎవ్వరినీ వదిలి పెట్టడనేది మర్చిపోవద్దు. సిద్దిపేటల ఉన్న మంత్రి ఎగిరెగిరి పని చేస్తాండు. ఇవాళ నాకు జరిగినట్లు రేపు నీక్కూడా జరుగుతదని గుర్తుపెట్టుకో..’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కొందరు మంత్రులను ఉద్దేశించి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాల, నేరెళ్ల, గూడూరు, ఖాసింపల్లి, తంగిడిపల్లి, వంగపల్లిలో మంగళవారం రెండో రోజు ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన సభల్లో ఈటల మాట్లాడుతూ ‘అయినోన్ని వాకిట్ల పెట్టి కానోన్ని కంచంలో పెట్టుకున్నడు కేసీఆర్‌.

ఎవడు కొట్లాడిండు తెలంగాణ ఉద్యమంలో.. ఎవరి మీద కేసులు ఉన్నయి, ఎవరు జైళ్లకు పోయిండ్లు, తిట్టినోడు ఎవ్వడో, కాపాడినోడు ఎవ్వడో తెల్వదా’అని అన్నారు. కాపాడినోళ్లందరినీ బయటకు పంపించారని, తిట్టినోళ్లంతా ఇవాళ మంత్రులై వెలగబెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘పింఛన్లిచ్చే మంత్రివి నువ్వే కదా.. నీ చేతుల్లో ఉన్నదా పింఛన్లిచ్చే దమ్ము, అధికారం’ అని మంత్రి ఎర్రబెల్లిని  ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, మూడెకరాల భూమి, ఇళ్లు ఇవ్వకుండా దళిత బంధు పేరిట రూ.10 లక్షల చొప్పున ఇస్తామంటే నమ్మశక్యంగా లేదన్నారు. ‘దళితుడిని ముఖ్యమంత్రి చేసినవా, ఉన్న ఒక్క ఉప ముఖ్యమంత్రిని నెల రోజుల్లోనే పీకేసిన చరిత్ర కేసీఆర్‌ది కాదా’అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో 17 శాతం దళిత జనాభా ఉంటే కనీసం ఇద్దరు మంత్రులుం డాలె, కానీ ఒక్కరే ఉంటడు, ఒకసారి మాల, ఇంకోసారి మాదిగ, ఇదీ దళితుల ను గౌరవించిన తీరు’ అని విమర్శించారు. ‘పోలీసోళ్లను కూడా చూస్తున్నా.. ఫొటోలు తీస్తాండ్లు, మేం నక్సలైట్లం అనుకుంటున్నారా ఏమన్నా. నౌకరీ చేయడం చేతకాకపోతే గులాబీ గులాబీ డ్రెస్‌ వేసుకుని కేసీఆర్‌ బానిసలం అని చెప్పుకోండి’ అంటూ మండిపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలు ఆపాలని పోలీసు అధికారులను కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top