తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రచార పర్వానికి తెర

Election campaign completes in third phase - Sakshi

3 రాష్ట్రాలు, ఒక యూటీలో ముగిసిన ఎన్నికల ప్రచారం

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశ ప్రచారం ముగింపు

చెన్నై/తిరువనంతపురం/గువాహటి/కోల్‌కతా: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది.  పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో దశ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. ఇన్నాళ్లూ అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు ఇక ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ నెల 6న(మంగళవారం) జరిగే ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. కీలకమైన తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. తమిళనాట 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ముఖ్యమంత్రి కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్, సినీ నటుడు కమల్‌ హాసన్‌ తదితర ప్రముఖులు ఎన్నికల బరిలోకి దిగారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 6.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేరళలో చివరి రోజు ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు. భారీ రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఎవరూ పెద్దగా లెక్కచేయలేదు. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో ఆదివారం భారీ సభలు జరిగాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఉత్తర కోజికోడ్, తిరువనంతపురం జిల్లాల్లో, సీఎం విజయన్‌ కన్నూరులో రోడ్డు షోల్లో పాల్గొన్నారు.

ఆఖరి రోజు కనిపించని హడావుడి
పుదుచ్చేరిలో పలు నియోజకవర్గాల్లో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపించలేదు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ నేతృత్వంలోని సెక్యులర్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్, ఎన్డీయే నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ మధ్యే ప్రధానమైన పోటీ సాగుతోంది. అస్సాంలో మూడో దశ ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి, అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, నెగ్గాలని కాంగ్రెస్‌ కూటమి ఆరాట పడుతోంది.

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. దక్షిణ 24 పరగణాల జిల్లా, హుగ్లీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 31 స్థానాల్లో ప్రచారం ముగిసింది. మూడో దశలో 205 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగనుండడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top