తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి తన మద్దతు ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తున్న టీవీకే అధినేత విజయ్
గంట గంటకూ మారిన రాజకీయ సమీకరణలు
విజయ్‌కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ !
బద్ధవ్యతిరేక డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు !!
అంతా వట్టిమాటలే అంటూ కొట్టేసిన ప్రధాన పార్టీలు
మేజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటానని విజయ్‌ను తిరిగి పంపేసిన గవర్నర్.. ఎత్తుకు పైఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ
సాక్షి, చెన్నై: వందకు పైగా స్థానాల్లో గెలిచిన టీవీకే చీఫ్ విజయ్ మరో డజనుమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఖచ్చితంగా సీఎం కుర్చీపై కూర్చుంటారని అంతా భావిస్తున్న వేళ తమిళనాట పెను సంచలనాల పర్వానికి తెరలేచింది. గంట గంటకూ ఊహించని మలుపులతో అధికార పీఠం చివరికి ఎవరి పరమవుతుందో ఎవరూ చెప్పలేని అనూహ్య పరిస్థితి ఏర్పడింది. కలలో కూడా ఊహించనట్లుగా బద్ధ వ్యతిరేక డీఎంకే, అన్నాడీఎంకేలు ఏకమైపోయి సీఎం కుర్చీని తన్నుకుపోతాయన్న వార్త ఇప్పుడు యావత్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. బయటి ఎమ్మెల్యేల మద్దతుతో ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చని గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు ఊహించని పరిణామాలు ఒకదాని వెంట మరోటి వచ్చిపడి ఊపిరాడనివ్వట్లేవు.
అధికారమే పరమావధిగా మీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అన్న ప్రశ్నకు డీఎంకే, అన్నాడీఎంకేలు ‘లేదు’అనే సమాధానిస్తున్నాయి. కానీ రహస్యంగా రెండు పార్టీల మధ్య విస్తతస్థాయిలో మంతనాలు జరుగుతున్నాయని తమిళనాడు మీడియాలో వార్తలు షికార్లుచేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే ఉమ్మడిగా వచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామంటే గవర్నర్ అర్లేకర్ సరేనంటారా లేదంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకే తొలి ప్రాధాన్యత ఇస్తానంటారా? అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణులతో గవర్నర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులను లోక్ భవన్‌కు పిలిపించి, సుదీర్ఘంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి పదిన్నరగంటలదాకా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
ద్రవిడ పార్టీల మధ్య కుదరని సయోధ్య!
విజయ్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు రహస్య చర్చలు జరిపాయని మీడియాలో వార్తలొచ్చాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రతినిధుల బృందాలు లోతైన చర్చలు జరిపాయని తెలుస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అన్నాడీఎంకే ఆఫర్ చేయగా అందుకు డీఎంకే సమ్మతి తెలిపిందని, కానీ బయటి నుంచి మద్దతు ఇస్తామని డీఎంకే వెల్లడించినట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలో చేరితే ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని అన్నాడీఎంకే ఆఫర్‌చేసినట్లు తెలుస్తోంది. అందుకే ససేమిరా ఒప్పుకోబోమని, తప్పదనుకుంటే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని డీఎంకే తెగేసి చెప్పడంతో అర్ధంతరంగా చర్చలు ముగిశాయని వార్తలొచ్చాయి.
118 మంది మద్దతుతో వస్తే చూస్తాం: గవర్నర్
అంతకుముందు బుధవారం ఉదయం నుంచి తమిళనాట పలు నాటకీయ పరిణామాలు సంభవించాయి. మంగళవారం రాత్రే మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లను జతచేసి టీవీకే చీఫ్ విజయ్ తన కీలక పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్‌కుమార్ తదితరలు ఉన్నారు. టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది. వీళ్లకు కాంగ్రెస్‌లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్లజాబితాను గవర్నర్‌కు విజయ్ సమరి్పంచి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అందుకు గవర్నర్ సమ్మతి తెలపలేదు. 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్‌కు గవర్నర్ సూచించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. దీంతో నిరాశతో విజయ్ వెనుతిరిగారు.
మొదలైన మలుపుల పర్వం
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించలేదన్న వార్త తెలీగానే అప్పటిదాకా ప్రమాణస్వీకారం కోసం స్టేడియంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. అయితే కాంగ్రెస్‌కుతోడుగా అన్నాడీఎంకే సైతం టీవీకేకు మద్దతు పలకనుందనే వార్త వెనువెంటనే చక్కర్లు కొట్టింది. దీనిని అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ‘‘ఇది పూర్తిగా అబద్ధం. ఏ రకంగా చూసినా మేం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోం. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశానుసారమే మా 47 మంది ఎమ్మెల్యేలు నడుచుకుంటారు’’అని పార్టీ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పష్టంచేశారు. తాము సైతం డీఎంకే కూటమికే మద్దతు ఇస్తామని సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టంచేశారు. అంతకుముందు సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు డీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. మీ వెంటే ఉంటామని మాటిచ్చారు. అయితే గురువారం సమావేశమై టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే మిత్రపక్షమైన విదుథలై ఛిరుథైగల్ కట్చి(వీసీకే) చీఫ్ థోల్ తిరుమవాలన్ ప్రకటించారు. ‘‘మద్దతు ఇవ్వాలని విజయ్ మమ్మల్ని కోరారు. పార్టీ ముఖ్యులతో మాట్లాడాక ఏ విషయమైనా చెప్పగలను’’అని తిరుమవాలన్ వ్యాఖ్యానించారు. వీసీకేకు ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. 
మద్దతిస్తూ ముందుకొచ్చిన కాంగ్రెస్
బుధవారం చెన్నై పనయూరులోని టీవీకే కార్యాలయానికి తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరీశ్ చోడంకర్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి నేతృత్వంలోని బృందం వెళ్లింది. వీరికి పుష్పగుచ్చాలతో విజయ్ బృందం ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు సంతకాలతో కూడిన లేఖను విజయ్‌కు కాంగ్రెస్ నేతలు అందజేశారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల దాకా తమ మధ్య పొత్తు కొనసాగాలని, మతతత్వ పార్టీలను చేర్చుకోవద్దని కాంగ్రెస్ షరతు విధించింది. కాంగ్రెస్ మహిళా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కోరింది.
నాన్చుడి ధోరణి మానుకోవాలి..
ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ నాన్చడమేంటని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మండిపడ్డారు. ‘‘బలనిరూపణ అనేది శాసనసభలో చేస్తారు. లోక్‌భవన్‌లో కాదు. లోక్‌భవన్‌లోనే 118 సంఖ్య చూపించాల్సిన అవసరం లేదు. ఇకనైనా గవర్నర్ మాటున బీజేపీ రాజకీయాలుచేయడం మానుకోవాలి. తక్షణం గవర్నర్ విజయ్‌ను మళ్లీ పిలిచి వెంటనే బలనిరూపణకు అవకాశమివ్వాలి’’అని జ్యోతిమణి డిమాండ్‌చేశారు.
ఏం జరగొచ్చు!!
టీవీకే, కాంగ్రెస్ కలిస్తే?
కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలదు. ఇక్కడ టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్‌లోని ఐదుగురు కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే, సీపీఐ, సీపీఎంలోని తలో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఆరుగురు వీళ్లకు జతకలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు.
టీవీకే, అన్నాడీఎంకే కలిస్తే?
అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జతకూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు.
ద్రవిడ పార్టీలు దగ్గరైతే?
డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డీఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరుపార్టీల మిత్రపక్షాలు తోడు వస్తే ఇది సాధ్యం. పీఎంకే(4), ఐయూఎంఎల్(2), సీపీఐ(2), సీపీఎం(2), ఏఎంఎంకే(1),డీఎండీకే(1) ఎమ్మెల్యేలు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది.
మొదలైన రిసార్ట్ రాజకీయాలు
తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకేలు తమ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో పాతిక మందిని పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌కు బుధవారం రాత్రి 11.30 గంటలకు తరలించారు. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలు రిసార్ట్‌కు వెళ్లారు. సీ వీషణ్ముగం ఉదయం టీవీకేతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామిన అన్నాడీఎంకే అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడం గమనార్హం. డీఎంకే ఎమ్మెల్యేలూ పుదుచ్చేరి సమీప రిసార్ట్‌కు వెళ్లినట్లు వార్తలొచ్చాయి.
విజయ్‌కు భద్రత మాయం!
విజయ్‌కు మంగళవారం, బుధవారం తమిళనాడు పోలీసులు గట్టి భద్రత కల్పించారు. గవర్నర్‌ను ఆయన కలిసే సమయంలోనూ తమిళనాడు ప్రభుత్వం ఉపయోగించే కాన్వాయ్ వెంటరాగా సొంత వాహనంలోనే లోక్‌భవన్‌కు వెళ్లివచ్చారు. అయితే బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో మాత్రం విజయ్ పట్టినంబాక్కం నివాసం నుంచి నీలాంకరై ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ఉదయం కల్పించిన కాన్వాయ్ భద్రత లేదు. అదనపు భద్రతను తొలగించారని తెలుస్తోంది. తనకు అదనపు భద్రత అక్కర్లేదని విజయ్ చెప్పడంతోనే ప్రభుత్వం కాన్వాయ్‌ను ఉపసంహరించుకుందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.


