
లోక్‌సభ ఎన్నికల్లో ‘గ్యారంటీ’ హామీలపైనే ఆశలు
మహిళలు, రైతులు, యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం
‘కులగణన’ ప్రకటనతో బీసీలను ఆకర్షించే వ్యూహం..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి కారణమైన ‘గ్యారంటీ’లపైనే కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. ‘గ్యారంటీ’ హామీలతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న తరహాలోనే.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాన్ని రచించింది. లోక్‌సభ ఎన్నికల్లో ‘పాంచ్ న్యాయ్ (ఐదు న్యాయాలు)’ పేరిట హామీలతో గోదాలో పోరాడేందుకు సిద్ధమైంది. ప్రధానంగా మహిళలు, రైతులు, యువ ఓటర్లను ఆకట్టుకునేలా.. కీలక హామీలతో మేనిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నేతలు.. మహిళలకు ఏటా రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ వంటి ప్రకటనలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపడతామనీ పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌పై మరింత బాధ్యత ఉందని టీపీసీసీ కీలక నేతలు అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి లోక్‌సభ స్థాయి పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని నాయకులకు వివరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో ‘గ్యారంటీ’లతో..
కాంగ్రెస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐదు గ్యారంటీ హామీలు ఇచ్చింది. అక్కడ విజయం సాధించిన తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని అధిష్టానం పెద్దలు స్వయంగా హామీ ఇచ్చారు కూడా. ఇది ప్రభావం చూపించి తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ‘గ్యారంటీ’ హామీలు ప్రభావవంతంగా పనిచేయడంతో.. జాతీయ స్థాయిలోనూ ఈ అంశంపై దృష్టి పడిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కువ సీట్లపై ఆశలు
తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 అంశాలకు సంబంధించి ఐదు అంశాలను ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, దీనితో ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తారని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం ‘పాంచ్ న్యాయ్’ హామీలను ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహించే భారీ బహిరంగసభలో ఏఐసీసీ మేనిఫెస్టోను తెలుగులో ఆవిష్కరించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు హామీలను అమలు చేశామని మంత్రులు, పార్టీ నేతలు చెప్తున్నారు.
మహిళలు, బీసీలను ఆకట్టుకునేలా..
‘గ్యారంటీ’ల స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ జాతీయ నేతలు ప్రకటించారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ హామీలు మహిళలను అమితంగా ఆకట్టుకుంటాయన్న ధీమాను రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీల కులగణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో సగానికిపైగా ఉన్న బీసీ కులాల జనాభాకు దశాదిశను నిర్దేశిస్తుందన్న అభిప్రాయం ఉందని చెప్తున్నాయి.
ఇదే తరహాలో దేశమంతటా కులగణన చేపట్టడాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎంచుకుందని వివరిస్తున్నాయి. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, అప్పుల బాధ నుంచి రైతులకు ఉపశమనం కల్పించేందుకు శాశ్వత రైతు రుణమాఫీ కమిషన్, పంట నష్టపోయిన రైతులకు 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారంటీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుస్తాయని నేతలు చెప్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద కనీస రోజు కూలీ రూ.400 ఇవ్వాలని తీర్మానించడం, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని ప్రకటించడం వంటివి పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత కార్మీకులను ఆకర్షిస్తుందని పేర్కొంటున్నారు.