పాక్‌పై భారత్‌ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు | Congress MP Charanjit Singh Channi Demands Surgical Strike Proof | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రైక్‌పై ఆధారాలు కావాలా? పాక్‌ వెళ్లి చూసుకోండి: బీజేపీ కౌంటర్‌

May 3 2025 7:39 AM | Updated on May 3 2025 9:17 AM

Congress MP Charanjit Singh Channi Demands Surgical Strike Proof

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ విషయమై కాంగ్రెస్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.

వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్‌ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్‌ చేశారు.

ఇక, కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్‌ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్‌ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.

మరోవైపు.. సదరు కాంగ్రెస్‌ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్‌ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్‌ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్‌ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement