కేరళ నెక్ట్స్‌ సీఎం ఎవరు? | Congress faces KC Venugopal as chief minister question | Sakshi
Sakshi News home page

కేరళ నెక్ట్స్‌ సీఎం ఎవరు?

May 2 2026 12:09 AM | Updated on May 2 2026 12:16 AM

Congress faces KC Venugopal as chief minister question

‘‘ఒకవేళ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?’’... ఈ ప్రశ్న దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తలెత్తుతుంది. ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో నేతలు పోటీ పడుతున్నారన్న ప్రచారం కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తాజాగా, జరిగిన కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు ప్రజల ముందున్న ప్రశ్న ‘ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?’ అనేదే.. కేసీ వేణుగోపాల్‌ పేరు ఎందుకు బాగా వినిపిస్తోంది? ముఖ్యమంత్రి రేసులో ఇంకా ఎవరెవరు ఉండొచ్చు?  
 
కేరళలో ఓటింగ్ ముగిసింది.. అభ్యర్థుల భవితవ్యాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అన్న అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మే 4పై ఉంది. ఆ రోజు భారత ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు చేసి కేరళతో పాటు మిగతా రాష్ట్రాల ఫలితాలను ప్రకటిస్తుంది.

వేణుగోపాల్‌కే ముఖ్యమంత్రి పదవి? 
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? హైకమాండ్‌ ఆయన వైపేగ్గు చూపుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిక్ అన్వర్ దీనిపై మాట్లాడుతూ... పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆసక్తి చూపితే ఆయన కేరళ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని చెప్పారు. కేరళలో యూడీఎఫ్ గెలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహమూ లేదని ధీమా వ్యక్తం చేశారు. అన్వర్ గతంలో కేరళలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆయన బిహార్‌లోని కటిహార్ నియోజకవర్గ ఎంపీ.

హైకమాండ్ నిర్ణయమే కీలకం
వేణుగోపాల్ పేరును సూచించినప్పటికీ.. చివరి నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని అన్వర్ చెప్పారు. హైకమాండ్ సరైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని అన్నారు. ‘‘పార్టీ ఒక పరిశీలకుడిని నియమిస్తుంది. ఆయన పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈచర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైతే, ఆ సమాచారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చేరుతుంది. చివరి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది” అని ఆయన చెప్పారు.

వేణుగోపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ముఖ్యమంత్రి అవుతారా? అని అన్వర్‌ను అడిగితే, ఆసక్తి ఉంటే అవసరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. “పార్టీ శాసనసభ్యులు హైకమాండ్‌కు తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇస్తే అదే జరుగుతుంది” అని అన్నారు.

సీఎం రేసులో ఇంకా ఎవరు?
కేసీ వేణుగోపాల్‌ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. వేణుగోపాల్‌తో పాటు రమేశ్‌ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్‌ కేరళ కాంగ్రెస్‌లో బలమున్న నాయకులు. రమేశ్‌ రామకృష్ణన్ చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. పరిపాలనా అనుభవం, పార్టీ నిర్మాణంలో ప్రభావం ఉంది. వీడీ సతీశన్‌ కేరళలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు. యువతను ఆకర్షిస్తారు. అసెంబ్లీలో చురుకుగా ఉంటారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తుంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండో స్థానంలో ఉంటుంది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్క్ 71. యూడీఎఫ్ 70-90 సీట్లు, ఎల్డీఎఫ్ 49-65 సీట్లు గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

అయితే కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈ అంచనాలను కొట్టిపారేశారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అయ్యాయని అన్నారు. ఎల్డీఎఫ్ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరిగాయి. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement