నోరు జారా.. క్షమించండి: అభ్యంతరకర వ్యాఖ్యలపై వెంకటరెడ్డికి అద్దంకి క్షమాపణ

Congress Addanki Dayakar Apology To Komatireddy Venkat Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్‌. 

శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్‌పై విమర్శలు మొదలయ్యాయి. 

కాంగ్రెస్‌ నేతలు పలువురు అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్‌. దీంతో.. 

వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్‌ ప్రకటించారు.  

ఇదిలా ఉంటే.. సీనియర్‌ నేత మల్లు రవి సైతం అద్దంకి క్షమాపణలపై స్పందించారు. కాంగ్రెస్ సోషల్ జస్టిస్ సమావేశంలో అద్దంకి దయాకర్ చేసిన వాఖ్యల పై చర్చ జరిగింది. అద్దంకి  చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీశాయి. వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం. షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి అద్దంకి సిద్దంగా ఉన్నారు అని మల్లు రవి తెలిపారు.

ఇదీ చదవండి: టార్గెట్‌ రేవంత్‌.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top