ఇక చాలు.. తప్పుకుంటా: బీవీ రాఘవులు 

Complaint of AP leaders on Raghavulu  - Sakshi

సుత్తి కొడవలి పార్టీలో కొట్లాట 

రాఘవులు పోకడలపై ఏపీ నేతల ఫిర్యాదు 

మనస్తాపంతో పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకోవాలని నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..? ఆయన ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీకి చెందిన పార్టీ నేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి రాసిన లేఖ, దానిపై నాయకత్వం ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించిన నేపథ్యంలో రాఘవులు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు లేఖ ద్వారా స్పష్టం చేసినట్టు సమాచారం.

ఏపీలో పార్టీ పదవులకు సంబంధించి తలెత్తిన అభిప్రాయభేదాలు, కొందరిపట్ల రాఘవులు వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ పంపిన ఫిర్యాదు లేఖపై కేంద్ర నాయకత్వం విచారణ జరిపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాఘవులు తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. విచారణ నివేదిక, రాఘవులు తప్పుకుంటానన్న లేఖపై ఆదివారం ఢిల్లీలో జరిగే పార్టీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విచారణ కమిటీ రాఘవులు చర్యలను తప్పుపట్టిందా? లేక విచారణ జరిపించడంపైనే ఆయన మనస్తాపం చెంది పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని లేఖ ఇచ్చారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టత కోసం రాఘవులు ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. 

తమ్మినేని, శ్రీనివాసరావుల్లో ఒకరికి చాన్స్‌ 
పొలిట్‌బ్యూరో సభ్యునిగానే రాఘవులు రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన్ను తప్పించే అవకాశం లేదని పార్టీ లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటేఈ రెండు రాష్ట్రాల నుంచి ఒకరిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారని చెబుతున్నారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం లేదా ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వి.శ్రీనివాసరావుల్లో ఒకరికి ఆ చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిట్‌బ్యూరో నుంచి తప్పిస్తే రాఘవులు ఇక సేవా కార్యక్రమాలకు పరిమితం కావాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top