ఓటును సంధించండి: వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan Speech Highlights At Medarametla Siddham Public Meeting, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఓటును సంధించండి: వైఎస్‌ జగన్‌

Published Mon, Mar 11 2024 4:55 AM

CM YS Jagan Comments At Medarametla Siddham Public Meeting - Sakshi

జమ్మిచెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి 

పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి 

మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

నాకు అధికారమంటే వ్యామోహం లేదు..  ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి..  

ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే కోరిక 

పేదల తలరాతలు మార్చాలన్నదే నా కల, నా లక్ష్యం 

బాబు సైకిల్‌కు చక్రాలు లేవు.. అది తుప్పు పట్టింది 

దాన్ని తోయడానికి వేరే పారీ్టలు కావాలి 

అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు 

దత్తపుత్రుడు సైకిల్‌ దిగమంటే దిగుతాడు.. ఎక్కమంటే ఎక్కుతాడు 

త్వరలో మేనిఫెస్టో.. చేయగలిగిందే చెబుతాం  

2014 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేశారు.. ఇప్పుడు మళ్లీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు 

బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం 

మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే 

ప్రతి గడప నుంచి స్టార్‌ క్యాంపైనర్లు బయటకు రావాలి 

ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి 

పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా  

మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగకాసిన మామిడి చెట్టులా  ఉంటే, చంద్రబాబు పార్టీ అందర్నీ మోసం చేసి.. వెన్నుపోట్లు పొడిచి, గత పాపాలకు ఫలితం అనుభవిస్తూ తెగులు పట్టిన చెట్టులా ఉంది. మన ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో గడపగడపకూ ప్రజల వద్దకు వెళ్లి చేసిన మంచిని చెబుతూ తిరుగుతుంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు.. ఇలా ఓ అరడజను గడపలు.. ఐదేళ్లుగా తన మనుషులను పంపి, తానూ తిరుగుతున్నాడు.

ఇదీ చంద్రబాబు మార్క్‌ రాజకీయం. మీ జగన్‌ మార్క్‌ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. నిబద్ధత ఉంది. సిద్ధాంత బలం ఉంది. ఇంటింటికీ మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్కచెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. ప్రతి ఇంట్లో చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులున్నాయి.

బిందువూ బిందువూ సింధువైనట్లు నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రభంజనంలా తరలి వచ్చిన మీ అందరితో ఈ మేదరమెట్లలో ఓ జన సముద్రం కనిపిస్తోంది. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకూ మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్‌ చేస్తున్నాడు. సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం. ఉత్తర కోస్తా సిద్ధం. రాయలసీమ సిద్ధం. ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు : జమ్మి చెట్టుపై దాచిన ఓటు అనే అస్త్రాన్ని బయటకు తీసి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై సంధించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ధర్మ, అధర్మాల మధ్య.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులే మనకు పోటీ అని.. రాష్ట్రంలో ఇంటింటికీ మంచి చేసిన మనం.. 5 కోట్ల మంది ప్రజల అండదండలతో ‘సిద్ధం’ అంటున్నామని చెప్పారు. తనకు అధికారం అంటే వ్యామోహం లేదని, పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన సిద్ధం సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేశారు. ‘బహుశా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేస్తుంది. చంద్రబాబు పార్టీ, చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ, వీరంతా మన మీద, మన పేదల భవిష్యత్‌ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పార్టీల్లో సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం లేదు.

ఇందులో కొన్ని పార్టీలకు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. వారి వెనుక ప్రజలు లేరు.. చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు. నాకు చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్‌ స్టార్లు లేరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.

ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంత మంది పేదింటి స్టార్‌ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నార’ని స్పష్టం చేశారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెబుతాం.. చెప్పింది చేస్తాం అని తెలిపారు. ‘జగన్‌ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే, తగ్గేదేలే.. 2019లో మాట ఇచ్చాను. మీ బిడ్డ వస్తే  మంచి రోజులు వస్తాయని చెప్పాను. ఈ మంచి కొనసాగాలంటే మళ్లీ జగనన్నను తెచ్చుకుందామని ప్రతి ఇంట్లో చెప్పండి’ అని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఢిల్లీలో మోకరిల్లిన చంద్రబాబు
► జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్‌ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి, మంచి వల్ల మనకున్న ప్రజా బలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలపడలేక, ఏపీలో తన సైకిల్‌ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్లి పడిగాపులుగాసి, ఢిల్లీలో మోకరిల్లుతున్న పరిస్థితులు చూస్తున్నాం.

జగన్‌ వల్ల ప్రతి ఇంటికి మంచి జరిగి, మేనిఫెస్టోలో చెప్పింది చేయబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తి ఇన్ని పొత్తుల కోసం పాకులాడుతున్నాడు. ఇంత మందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు. 

► చంద్రబాబునాయుడు సైకిల్‌కు ట్యూబుల్లేవు. టైర్లు లేవు. చక్రాలే లేవు. తుప్పు పట్టిన పరిస్థితిలో ఉంది. ఈ సైకిల్‌ను తొక్కటానికి, తోయటానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. బాబు పేరు చెబితే ఒక్క మంచీ, ఒక్క స్కీము కూడా వినపడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్‌ అయితే, సైకిల్‌ సీటు తనకు కావాలని అడగడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా అడగనే అడగడు.

ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నావని కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్‌ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబునాయుడు సిట్‌ అంటే కూర్చుంటాడు. స్టాండ్‌ అంటే నిలబడతాడు. ఎక్కడ సైకిల్‌ దిగమంటే అక్కడ దిగుతాడు. ఎప్పుడు సైకిల్‌ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలాడమంటే రక్తికట్టించేట్టు డ్రామా ఆడతాడు. 

పేదవాడి భవిష్యత్‌ మార్చడం కోసమే 
మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నా. అధికారం అంటే వ్యామోహం లేదు. అధికారం పోతుందన్న భయం ఎప్పుడూ ఉండదు. మీ బిడ్డ పేరు ప్రతి చరిత్ర పుస్తకంలో ఉండిపోవాలన్నదే కోరిక. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడటం కోసం,  చనిపోయిన తర్వాత కూడా మీ బిడ్డ ఎప్పుడూ పేదవాడి గుండెల్లో బతికుండటం కోసం మీ బిడ్డకు అధికారం కావాలి. దాని కోసమే మీ బిడ్డ అధికారం అడుగుతున్నాడు. మంచి చేయడం కోసం మంచి మనసుతో మీ బిడ్డ సంకల్పిస్తున్నాడు. 

మన ఫ్యాన్‌ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు. నేరుగా ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది. వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన ఫ్యాన్‌కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల నుంచి వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన నుంచి వస్తుంది. మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్, ఖురాన్‌ ,భగవద్గీతగా భావించి 99 శాతం హామీలు అమలు చేసిన నిజాయితీ నుంచి మన ఫ్యాన్‌కు కరెంటు వస్తుంది. 

మరోసారి అదే డ్రామా.. అవే పొత్తులు
► వెనకటికి చంద్రబాబు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట.. అయ్యా.. పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని అడిగారట. అప్పుడు ఆ బాబు.. ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది. చీర కొనిపెడితే చిరిగిపోతుంది. ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది. కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని చెప్పాడట.

ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు పరిస్థితి సున్నా. ఈ సున్నా ఇంటూ ఎన్ని పార్టీలున్నా దాని విలువ గుండు సున్నానే. ఇప్పుడు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడు. ఈ ముగ్గురూ కలిసి 2014లో ఇలాగే పొత్తుగా ఏర్పడి ఒకే స్టేజీ మీద కూర్చుని మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో తన ఫొటోతో పాటు దత్తపుత్రుడు, మోదీ ఫొటోలు వేసుకుని సంతకం పెట్టి.. ఇంటింటికీ చంద్రబాబు ఈ కరపత్రం (చూపిస్తూ) పంపించాడు. 

► రైతులు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్ ఫోర్స్, మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్, ఇంటింటికీ ఉద్యోగం లేదా అది వచ్చే దాకా నెలనెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు, సింగపూర్‌కు మించి రాష్ట్రం అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మాణం.. అంటూ హామీలు ఇచ్చాడు. ఇందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మరోసారి ఇదే డ్రామా, ఇవే పొత్తులు, ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మళ్లీ మోసం చేసేందుకు మీ అందరి ముందుకు వస్తున్నాడు. 

► చంద్రబాబు చూపిస్తున్న ఈ పొత్తులతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? అంటే ఎవరికి మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్‌ను టార్గెట్‌ చేయడం మాత్రమే వీళ్ల ఏకైక ఎజెండాగా కనపడుతోంది. అధికారంతో ప్రజలను దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలి. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి ఎంట్రెన్స్‌లో స్వర్గం చూపించి, లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్‌ టెక్నిక్‌ చంద్రబాబుకు అలవాటు.

అందుకే కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణ నుంచి కొన్ని హామీలని కలిపి కిచిడీ మేనిఫెస్టో తెచ్చాడు. చంద్రబాబు చేసే వాగ్దానాలకు శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా? చంద్రబాబు కేరక్టర్‌కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం సాకులు చూపకుండా పేదలందరికీ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికీ అందించాం. 

మళ్లీ జగనన్నను తెచ్చుకుందాం 
► మళ్లీ జగనన్ననే తెచ్చుకుందామని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబు అనే మాయలేడి వలలో పడొద్దని చెప్పండి. అన్న పొత్తుల్ని నమ్ముకోలేదు, అన్న మనల్నే నమ్ముకున్నాడు, ఆ దేవుడిని నమ్ముకున్నాడు.. అన్న ఒంటరిగానే సింహంలా మనందరికీ తోడుగా నిలబడ్డాడు.. అని ప్రతి ఇంటింటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ మన అన్నను గెలిపించేందుకు చేయి చేయి కలిపి.. మనమంతా ఒక్కటవుదాం అని చెప్పండి. ఇంటింటికీ పింఛన్, ఇళ్ల నిర్మాణం, అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన కొనసాగాలంటే అన్న వస్తేనే జరుగుతుందని చెప్పండి. గవర్నమెంట్‌ బడి, గవర్నమెంట్‌ ఆస్పత్రి బాగు పడుతుందని, నవరత్నాల్లోని అన్ని పథకాలు కొనసాగుతాయని చెప్పండి.

► ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తు మీద అసెంబ్లీకి ఒక ఓటు, పార్లమెంటుకు ఒక ఓటు వేస్తేనే మళ్లీ అన్న సీఎం అవుతాడని చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే.. మీకు అందే పథకాలన్నింటి రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుందని కూడా చెప్పండి. అప్పుడు మళ్లీ జన్మభూమి కమిటీలు.. లంచాలు, వివక్షల రాజ్యం, అవ్వలు, తాతలు, రైతన్నలు క్యూలో నిలబడే పరిస్థితి, గవర్నమెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేయడం అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వలంటీర్‌ వ్యవస్థ రద్దుకు, ఇంగ్లిష్‌ మీడియం రద్దుకు మీరే ఓటు వేసినట్లు అని చెప్పండి.

గవర్నమెంట్‌ బడిని మళ్లీ కార్పొరేట్లకు అమ్మేయడం, వైద్యం కోసం అప్పుల పాలు కావడం అని చెప్పండి. బాబుకు ఓటు వేయడం అంటే చంద్రముఖిని మనమే వెళ్లి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని ప్రతి ఇంట్లో చెప్పండి. ఫ్యా¯న్‌ ఇంట్లోనే ఉండాలి, సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్‌లోనే ఉండాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇవన్నీ వివరించి ఇంత మంచి చేశాం కాబట్టి 2019కి మించిన మెజారిటీ.. 175కు 175 ఎమ్మెల్యేలు, 25కు 25 ఎంపీలు తప్పక వస్తాయి. ఇలా గెలవడానికి మనమంతా సిద్ధమేనా? (సిద్ధం అని కేకలు) 

ఇదీ నా కల, లక్ష్యం
► ఆంధ్రప్రదేశ్‌లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణయుగానికి దారి తీస్తోంది. 90 శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం పేదరికం సంకెళ్లను తెంచుకుని అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కల. అలా చేయాలన్నది నా లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి క్వాలిటీ చదువులు, గొప్ప చదువులు, అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా పేద పిల్లలకు అవకాశం కల్పించడం, తద్వారా వారి బతుకులు మార్చాలన్నది నా కల, నా లక్ష్యం. ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్ల మీద తాను నిలబడేట్టుగా చేయాలన్నది నా కల, నా లక్ష్యం. ఏ ఒక్క రైతన్న వ్యవసాయం వల్ల నష్టపోయానని చెప్పే పరిస్థితి రాకుండా మార్చాలన్నది నా కల, నా లక్ష్యం. 

► ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఏ పేద కూడా పేదరికం వల్ల ఎదగలేకపోయాడన్న పరిస్థితిని మార్చాలన్నది మీ బిడ్డ కల. మీ బిడ్డ సంకల్పం. మీ బిడ్డ లక్ష్యం. వైద్యం కోసం ఏ ఒక్కరూ మరణించే పరిస్థితి, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనేది నా కల. ఆ దిశగా అడుగులు వేయడం నా లక్ష్యం.  వీటన్నింటినీ నెరవేర్చే దిశగా అడుగులు వేయడానికి మాత్రమే మీ బిడ్డకు అధికారం కావాలి.  

► చదువుల పరంగా, వ్యవసాయం పరంగా, వైద్యం పరంగా మార్పులు తీసుకొచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారత విషయంలో ఎప్పుడూ చూడని రీతిలో అడుగులు వేశాం. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఏపీని నంబర్‌ వన్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ఈ ప్రయాణం మధ్యలో ఉంది. ఈ ప్రయాణం ముందుకు పోవాలి. పేదవాడి భవిష్యత్‌ మారాలన్నదే నా కల. ఇదే లక్ష్యం.

కార్యకర్తలకు అండగా నిలబడతా 
► కార్యకర్తలకు, అభిమానులకు, వలంటీర్లకు ఒకే ఒక మాట చెబుతున్నా. ఇన్ని పదవులు, ఇన్ని హోదాలు భారతదేశ రాజకీయ చరిత్రలో మరే ఇతర పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదు. మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ప్రతి వలంటీర్‌.. అందరూ నా కుటుంబ సభ్యులే. వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరిగేలా చేసేందుకు మీ బిడ్డ ఉన్నాడు. వారు మరో రెండు మెట్లు ఎదిగేందుకు ఎన్నడూ లేనన్ని కార్పొరేషన్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు మొదలు, ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా గెలిపించుకుని అవకాశాలిచ్చిన పార్టీ ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే.  

► కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా 87 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో మీరందరూ మీ సచివాలయ పరిధిలో జరిగిన మంచి గురించి చూస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయం పరిధిలో ఏకంగా రూ.20 కోట్లకుపైగా లబ్ధి కలిగింది. ఆ డబ్బు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఊళ్లు మారాయి. బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. వ్యవసాయం మారింది. ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే వై నాట్‌ 175.. వై నాట్‌ 25 ఎంపీ స్థానాలు అని గట్టిగా అడుగుతున్నా. 

► ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రోత రాతలు, ఏబీఎన్, టీవీ5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. (సెల్‌ ఫోన్లలో టార్చ్‌ వెలిగించి చేతులు పైకెత్తి సిద్ధమే అంటూ నినదించారు). ఈ ఎన్నికల్లో శ్రీకృష్ణుడి పాత్ర మీది. ప్రజలందరిదీ. అర్జునుడి పాత్ర మీ బిడ్డది. మీ అన్నది, మీ తమ్ముడిది. 

‘సిద్ధం’ హైలైట్స్‌ 
► పలువురు వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు పార్టీ జెండా రంగులు, చేతిపై సిద్ధం పచ్చబొట్లతో కనిపించారు.  
► సభలో సిద్ధం కరపత్రాలను కార్యకర్తలు పెద్దఎత్తున పంపిణీ చేశారు. 
► దివంగత వైఎస్సార్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 
► సభకు చిన్న పిల్లలు, యువకులతోపాటు వృద్ధులు సైతం పార్టీ జెండాలను చేతబూని తరలివచ్చారు.  
► కొందరు దివ్యాంగులు వందలాది కిలోమీటర్లు నుంచి సిద్ధం సభకు తరలివచ్చారు. 
► సభ ప్రాంతంలో ఎయిర్‌ బెలూన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  
► సిద్ధం, నువ్వే మా భవిష్యత్తు జగనన్న పేరుతో టీ షర్టులను ధరించి వేలాది మంది సభకు వచ్చారు. 
► ఉదయం నుంచే సభా ప్రాంగణానికి అభిమానులు, కార్యకర్తల రాక మొదలైంది.  
► ముఖ్యమంత్రి కోసం ఎదురుచూస్తూ మండుటెండలోనూ నిరీక్షించారు. 
► సీఎం జగన్‌ను చూసేందుకు తెలంగాణ నుంచి కూడా అభిమానులు వచ్చారు. 
► సభా ప్రాంగణంతో పాటు చెన్నై –కోల్‌కతా రహదారి కిక్కిరిసిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. 
► పార్టీల పొత్తులతో చంద్రబాబు... ప్రజల బలంతో మనం ఈ సంగ్రామానికి సిద్ధమా? అని జగన్‌ ప్రశ్నించగా జనం కేకలు, ఈలలతో ప్రతిస్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు సైన్యాధ్యక్షులు ఉన్నారని, మనకు సైన్యమే ఉందని అన్నప్పుడు హర్షధ్వానాలు చేశారు. 
► రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, గత ఎన్నికలలో చిత్తుగా ఓడిన పార్టీ, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఒక వైపు ఉంటే ఐదు కోట్ల మంది అండదండలు మనకు ఉన్నా­యని అన్నప్పుడు జనం జై జగన్‌ అంటూ నినదించారు.  
► ప్రతిపక్ష పార్టీలకు పది మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉంటే నాకు మీరే స్టార్‌ క్యాంపెయినర్లు అని సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి పేర్కొన్నప్పుడు ఈలలతో స్పందించారు. మళ్లీ మా సీఎం నువ్వే అంటూ నినాదాలు చేశారు. 
► చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు, చక్రాలు లేవని వ్యాఖ్యానించినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.   

ఓటు విలువ ఇంటింటా వివరించాలి
► ఇవాళ నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.2.65 లక్షల కోట్లు నేరుగా వెళ్లింది. నాన్‌ డీబీటీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు, ఇతరత్రా లబ్ధితో మనం చేసిన ఖర్చు రూ.1.10 లక్షల కోట్లు. మొత్తంగా రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే ఏటా రూ.75 వేల కోట్లు. ఇలా ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర‡్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో వాదించారు.

ఇప్పుడు అదే నోటితో.. చెప్పేవన్నీ అబద్ధాలే కదా.. హద్దులెందుకు అని చంద్రబాబు ఆరు వాగ్దానాలు అంటూ వదిలారు. వీటిపై ఏటా మనం ఖర్చు చేస్తున్న దానికి రెట్టింపు అవుతుంది. అప్పుడు రాష్ట్రం ఏమవుతుందో మరి? దీని గురించి అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించాం. బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లుగా ప్రజలందరూ మోసపోతారు.

► ఈ 58 నెలల్లో ప్రజల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్‌ నొక్కాడు. దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు స్టార్‌ క్యాంపెయినర్‌గా బయటకు రావాలి. వంద మందికి చెప్పి ఓటు వేయించాలి. ఇందులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే ఐదేళ్లు వారి భవిష్యత్‌ను ఎలా మారుస్తుందో వివరించాలి.  

Advertisement
 
Advertisement