
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్. చిత్రంలో రాజనర్సింహ, మైనంపల్లి
మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం... కలిసికట్టుగా పనిచేసి పూర్వ వైభవం తెద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మెదక్ స్థానంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని స్పష్టం చేశారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మెదక్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖతోపాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ నేతలు కాటా శ్రీనివాస్‌గౌడ్, ఆవుల రాజిరెడ్డి, చెరు కు శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరికృష్ణ, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీని కూడా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారా్రస్తాలుగా చేసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కోరారు. మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలనీ, నేతలు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకోవడం ద్వారా పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.