సురేఖను తప్పించాల్సిందే! | CM Revanth Reddy Comments With KC Venugopal On Konda Surekha Issue | Sakshi
Sakshi News home page

సురేఖను తప్పించాల్సిందే!

Sep 2 2026 3:30 AM | Updated on Sep 2 2026 3:30 AM

CM Revanth Reddy Comments With KC Venugopal On Konda Surekha Issue

ఢిల్లీలో మంగళవారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన అనంతరం తిరిగి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కొండా ఫ్యామిలీ తీరుతో పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం 

కేసీ వేణుగోపాల్‌తో భేటీలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి?

కాన్వాయ్‌ లేకుండానే కేసీ ఇంటికి వెళ్లి సుమారు గంటపాటు సీఎం చర్చలు 

క్రమశిక్షణ సంఘం నిర్ణయాన్ని అమలు చేయాలనేది మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయమని స్పష్టీకరణ 

మంత్రివర్గ మార్పులు, విస్తరణపై తన అభిప్రాయం వెల్లడి... ఖాళీగా ఉన్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలపైనా చర్చ 

ఢిల్లీలోనే పీసీసీ చీఫ్, పలువురు మంత్రులు

ఖర్గే, కేసీతో నేడు భేటీ కానున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌ 

హస్తినకు వెళ్లిన మంత్రి కొండా సురేఖ

అధిష్టానం పిలుపు కోసం రాత్రి వరకు నిరీక్షణ.. నేటి ఉదయం పిలిచి మాట్లాడే అవకాశం 

ఖర్గేను కలిసిన స్పీకర్‌.. కేబినెట్‌లో చోటు కోసం వినతి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారంతో పార్టీ, ప్రభుత్వం రెండూ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. ఈ విషయంలో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నదే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయంగా ఉందని సీఎం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సీనియర్‌ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం మంగళవారం వారితో చర్చించింది. 

గతంలో పెద్ద మనసుతో ఉపేక్షించినా.. 
ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ముందుగా భేటీ అయ్యారు. కాన్వాయ్‌ లేకుండా కేవలం ఒక్క కారులోనే కేసీ ఇంటికి చేరుకొని గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండ సురేఖ అంశంలో జరిగిన పరిణామాలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వివరించినట్లు తెలిసింది. అలాగే పలు జిల్లాల్లో నేతల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలపై చర్చించారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ అంశంలో ఆమె శాఖలో బయటపడ్డ అవినీతి ఆరోపణలు, జిల్లాల నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గతంలోనే ఆమె కుమార్తె నేరుగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేసీకి ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అప్పుడే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనా పెద్ద మనసుతో ఉపేక్షించామని.. కానీ ప్రస్తుతం ఆమె కుమార్తె నేరుగా తనపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేను తూలనాడటాన్ని కేడర్‌ సహించట్లేదన్న విషయాన్ని బలంగా చెప్పినట్లుగా సమాచారం. అధిస్టానం నిర్ణయాలనే ధిక్కరించేలా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై సుస్మిత వ్యాఖ్యలను సైతం జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడుతున్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆమె కేబినెట్‌ను తొలగించడమే సమంజసమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక జి.చిన్నారెడ్డి విషయంలోనూ ఉపేక్షించరాదని.. ఈ రెండు విషయాలపై క్రమశిక్షణా సంఘం చేసిన నిర్ణయాన్ని పార్టీ అమలు చేసేలా చూడాలని సీఎం కోరినట్లుగా తెలిసింది.  

అసెంబ్లీ తర్వాత మంత్రివర్గ విస్తరణ.. 
అదే సమయంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో చేపట్టాల్సిన భర్తీతోపాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలన్న అంశం కేసీ, రేవంత్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్‌రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ స్పీకర్‌గా బాలూనాయక్‌ పేర్లను ముఖ్యమంత్రి ముందుంచినట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్‌ పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల మూడో వారంలో ఓ నిర్ణయానికి రావాలని నిశ్చయించినట్లు సమాచారం. ఆ తర్వాతే నామినేటెడ్‌ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తమైందని తెలియవచ్చింది. అలాగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటనపైనా ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం.  

ఢిల్లీలోనే మంత్రులు.. 
హస్తిన రాజకీయాల నేపథ్యంలో కీలక మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. జలవనరులకు సంబంధించిన సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం సైతం ఇక్కడే ఉండనున్నారు. అయితే రాజకీయ భేటీలు ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మంత్రివర్గంలో మార్పుచేర్పులు, నామినేటెడ్‌ పదవుల భర్తీలు జరిగితే మాత్రం ఆయన్ను పలిపించి మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలోనే ఉండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా స్వామినాథన్‌ ఫౌండేషన్‌కు అందిస్తున్న అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు. వారు సైతం అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారని అంటున్నారు. ఇక అధిస్టాన పెద్దల పిలుపుమేరకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ బుధవారం ఉదయం అధిస్టాన పెద్దలతో భేటీ కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన స్పీకర్ల సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను వివరిస్తూ కేబినెట్‌ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ఆయన తెలిపినట్లుగా సమాచారం. 

సురేఖ వేచిచూసినప్పటికీ..  
మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ ఒకే విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకున్నప్పటికీ అధిష్టానం నుంచి ఆమెకు ఇంకా పిలుపు రాలేదు. కేసీ వేణుగోపాల్‌ను సీఎం కలిసి వెళ్లాక కొండా సురేఖ కూడా కేసీని కలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి 10 గంటల సమయం దాటినా ఆమెను కేసీ పిలవలేదు. దీంతో బుధవారం ఉదయం అధిష్టానం పెద్దల నుంచి ఆమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

నివేదిక ఇచ్చా.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌: మల్లు రవి 
తమ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నివేదికను హైకమాండ్‌కు అందజేశానని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇక అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. హైకమాండ్‌ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement