
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్‌ఎస్, బీజేపీలు మళ్లీ అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే అడ్డదారు లు తొక్కుతున్నాయని, అడుగడుగునా లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నాయని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ‘ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్ కల్పి స్తే.. వీరి కోటాను 12 శాతానికి పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో బీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఉన్న ఒప్పందం ఏంటి?’అని భట్టి వ్యాఖ్యానించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఇప్పటివరకు ఖండించకపోవడం దురదృష్టకరమని, ఇలా ప్రతీ సందర్భంలో బీజేపీతో బీఆర్‌ఎస్ లాలూచీ పడుతోందని మండిపడ్డారు. హాథ్‌సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం హనుమకొండలో కాకతీయ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడారు.
బర్రెలు, గొర్రెలు ఇస్తే సరిపోతుందా?: అమిత్ షా వ్యాఖ్యలపై కేసీఆర్ నోరు విప్పకపోవడం వెనుక బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఆర్థిక దోపిడీ కారణాలని భట్టి ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పిదాలు రాష్ట్ర అభివృద్ధికి గుదిబండగా మారాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద గట్టిగా మాట్లాడలేకపోవడానికి ఈ తప్పిదాలే కారణమన్నారు. వందల సార్లు ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మనకు రావాల్సిన హక్కులను అడగకుండా స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర పునర్విభజన హక్కులను పణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేర్ల మీద అప్పు చేసి పెట్టిన ఐదు లక్షల కోట్లతో రాష్ట్ర ప్రజలకు చిన్న ఫలితం కూడా రాలేదని ఆరోపించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన క్రమంలో తెలంగాణలో రెండో రాజధాని అయిన వరంగల్ అభివృద్ధి చెందుతుందని ఆశించామని, అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందన్నారు.