లావాదేవీలే లేకుండా అవినీతా?

Buggana Rajendranath Comments On Yanamala Ramakrishnudu - Sakshi

యనమలకు అవగాహన ఉందా..లేదా?: బుగ్గన 

అది వాస్తవ వ్యయం కాదు.. బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ మాత్రమే

సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులేమీ ఉండవు

వేస్‌ అండ్‌ మీన్స్‌ గత సర్కారూ తీసుకుంది

రూ.30 వేల కోట్ల ఆదాయం క్షీణించినా పేదలను ఆదుకున్నాం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేత యనమల తదితరులు అవాస్తవాలతో అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి రూ.48 వేల కోట్లు వెళ్లాయంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించటాన్ని తీవ్రంగా ఖండించారు. అది వాస్తవిక వ్యయం కాదని, ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ అనే విషయాన్ని గ్రహించాలన్నారు. టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యనమల అవగాహనతో మాట్లాడుతున్నారా? లేక ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. 2020–21లో సుమారు రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గినా కరోనా సమయంలో పేదలను ఆదుకోవడంలో వెనుకంజ వేయలేదని బుగ్గన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇవీ..

► సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్‌ బిల్లులంటూ ఏవీ ఉండవు. చంద్రబాబు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థే ఈ గందరగోళానికి కారణం. బిల్లుల చెల్లింపులకు బీఎల్‌ఎం మాడ్యూల్‌ పొందుపర్చారు. ట్రెజరీ కోడ్‌ ప్రకారమే బిల్లుల చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేశారు.

► సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో ‘బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌’ను గుర్తించడం కోసం స్పెషల్‌ బిల్లులు అనే పేరు పెట్టారు. అంతేకానీ స్పెషల్‌ బిల్లుల హెడ్‌ అనేది లేదు.

► సీఎఫ్‌ఎంఎస్‌ను క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదు. అందుకే బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లు స్పెషల్‌ బిల్లుల కింద చూపారు. ట్రెజరీ అధికారులకు సీఎఫ్‌ఎంఎస్‌లో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ చేసే వెసులుబాటు ప్రస్తుతం లేనందువల్ల ఈ అధికారాన్ని సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు ఆర్థిక శాఖ అధికారులు అప్పగించారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక శాఖ, ట్రెజరీ నిబంధనల మేరకే జరిగింది.

► ఇదే విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు వివరంగా లేఖ రాశారు. ఆర్థిక సంవత్సరం చివరిలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ అనేది సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఏర్పడక ముందు ట్రెజరీ అధికారులే మ్యాన్యువల్‌గా చేసేవారు. ఈ వ్యవస్థ ఏర్పడిన తరువాత సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు ఈ అధికారం కట్టబెట్టారు.

► ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదు. నగదు లావాదేవీలు లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ అనేవి పద్దుల నిర్వహణలో భాగంగా ట్రెజరీ కోడ్‌లను అనుసరించి జరిగేవే. ఇంత చిన్న విషయం యనమలకు తెలియదా? గత ప్రభుత్వంలో ఆయన స్వీయ పర్యవేక్షణలోనే ఇలాంటివి అనేకం జరిగినా ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెబుతున్నారు.

► ఏపీ ఫైనాన్స్‌ కోడ్‌ 271 (4) ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరిలో పీడీ అకౌంట్లలో ఖర్చు కాకుండా మిగిలిన నిధులను బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా ట్రెజరీ అధికారులు నిధులను మురిగిపోయేటట్లు చేస్తారు.

► ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ప్రకారం ట్రెజరీ అధికారులు నిధులను మురిగిపోయేలా చేసే అవకాశం లేనందున బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు అధీకృతం చేశారు. దీనివల్ల నిధులను కేంద్రీకృతంగా మురిగిపోయేలా చేసే అధికారం సీఈవోకు వచ్చింది.

► ఈ విధానం మేం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. 2018–19, 2019–20లోనూ ఇదే పద్ధతి అనుసరించారు. 2018 –19లో 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను స్పెషల్‌ బిల్లులుగా చూపారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2020–21లో 54,183 బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్లను మాత్రమే స్పెషల్‌ బిల్లులుగా చూపింది. ఈ తరహా బిల్లుల్లో నగదు లావాదేవీలు ఉండవు.

► కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లింపులు మాత్రమే నగదు రూపంలో జరిగాయి. రూ.224 కోట్ల జీఎస్టీని నగదు రూపంలో చెల్లించాం. 2018–19లోనూ జీఎస్టీ చెల్లింపులు నగదు రూపంలోనే జరిగాయి..

► కేంద్రీకృత ప్రక్రియపై అకౌంటెంట్‌ జనరల్‌ సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోకు బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్రాన్సాక్షన్స్‌ను చేసే అధికారాన్ని ఇస్తూ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.  

► గత ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను అసంపూర్తిగా వదిలి వేస్తే ఆ లోపాలను మేం సవరించుకుంటూ వస్తున్నాం.

► 2020–21లో మొత్తం ఖర్చు రూ.2,03,448 కోట్లు (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యయం కలిపి). ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు కాగా అప్పులు, వడ్డీ చెల్లింపులు రూ.33,753 కోట్లు, నగదు బదిలీ, ఇతర పథకాలకు రూ.65,447 కోట్లు ఖర్చు అయింది. ఇవన్నీ పోనూ మిగిలిన ఖర్చు రూ 37,778 కోట్లు. ఇందులో మూలధనం ఖర్చు రూ.18,145 కోట్లు. మూలధనం ఖర్చులో నాడు–నేడు, మనబడి, ఆసుపత్రి పనులు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ వస్తాయి. వివరాలన్నీ ఇంత పారదర్శకంగా, స్పష్టంగా ఉంటే రూ.48 వేల కోట్ల అవినీతికి తావెక్కడుందో టీడీపీ పెద్దలకే తెలియాలి.

► టీడీపీ హయాంలో 2018–19లో మొత్తం వ్యయం రూ.1,64,841 కోట్లు కాగా ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు అన్నీ కలిపి రూ.53,811 కోట్లు వ్యయం అయింది. అప్పులు, వడ్డీ చెల్లింపులకు రూ.28,887 కోట్లు ఖర్చు చేశారు. నామమాత్రంగా మినహా నగదు బదిలీ పథకాలేవీ అమలు చేయలేదు. సుమారు రూ.82,143 కోట్లు ఇతరత్రా ఖర్చు చేశారు. నీరు–చెట్టు, ఆర్భాటంగా సదస్సులు, విదేశీ పర్యటనలకే వెచ్చించారు. 

► రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 103 రోజులు ఓడీకి, 331 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌కు ఆర్బీఐ వద్దకు వెళ్లిందని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకోవడం సర్వసాధారణం. పూర్తిగా నిబంధనలు పాటించాం. 

టీడీపీ సర్కారు 2018–19లో చేసిందేమిటి?
► తెలంగాణ కూడా 2020–21లో రూ.69,454 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ను ఉపయోగించుకుంది.

► 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,04,539 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించినా ఆ మొత్తాన్ని అప్పుడే తిరిగి చెల్లించింది. టీడీపీ హయాంలో 2018–19లో రూ.59,868 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా తీసుకుని రూ.139 కోట్లు తిరిగి చెల్లించకుండా దిగిపోవడం వాస్తవం కాదా? ఎవరి పాలనలో నగదు నిర్వహణ సరిగ్గా జరిగిందో ఈ ఉదంతం చూస్తే చాలు. 

► 2021 – 22 వేస్‌ అండ్‌ మీన్స్‌ వివరాలతో అనుబంధ బడ్జెట్‌ అంచనాలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాం. ఇదే విషయాన్ని అకౌంటెంట్‌ జనరల్‌కు తెలియ జేశాం. కానీ టీడీపీ సర్కారు 2018–19లో ఉభయ సభల ఆమోదం తీసుకోలేదు. 

► 2021–22 బడ్జెట్‌ అంచనాలు రూ.2,29,779 కోట్లు కాగా ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,20,634 కోట్లు (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వ్యయంతో కలిపి) ఖర్చు చేశాం. 96 శాతం నిధులను వ్యయం చేశాం. కరోనా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే పేదల జీవన ప్రమాణాలు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పారదర్శకంగా నగదు సాయం అందచేశాం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top