
ఇప్పటికే నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు చేరికకు లైన్‌క్లియర్..
రేపు పార్టీలో చేరే అవకాశం !
అదే దారిలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఓ ఎంపీ... మొదట్లో ఆసక్తి కనబరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ
సిట్టింగ్ ఎంపీల చేరికను బట్టి ఎంపీ అభ్యర్థుల ఖరారుపై ఓ స్పష్టత
29న 8 నుంచి 10 లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన...?
సాక్షి, హైదరాబాద్: ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు లైన్‌క్లియర్ అయింది. గురువారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగే పక్షంలో ఆరోజుగానీ మరుసటి రోజుగానీ ఈ చేరికలు ఉండొచ్చని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒక ఎంపీ మాత్రం గురువారం మంచిరోజు ఉందని, ఆ రోజే పార్టీలో చేరుతానని చెప్పినట్టు తెలిసింది. ఇటీవల అచ్చంపేటలో జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు గైర్హాజరయ్యారు.
ఆయనతోపాటు కుమారుడు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ఆ పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ, ఉమ్మడి ఖమ్మం నుంచి మరో సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సదరు ఎంపీ గతంలో ఉత్సాహం చూపినా, ఆ తర్వాత కొంత ఆచితూచే ధోరణితో ఉండడంతో చేరికపై పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తోంది.
టికెట్‌పై భరోసా ఇస్తే...?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము సిట్టింగ్‌లుగా ఉన్న చోట నుంచే అవకాశం ఇవ్వాలంటూ ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి భరోసా కోరినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీనేతలు చెబుతున్నారు.
బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎంపీల చేరికను బట్టి 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఓ స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 29న లేదా మరో తేదీన జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 8 నుంచి 10 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది.
సర్వేలే ప్రాతిపదికగా...
మోదీపాలన, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు తోడు పార్టీ తరఫున బరిలో నిలపాలని భావిస్తున్న అభ్యర్థులు, ఇతర పార్టీల సిట్టింగ్ ఎంపీల ఇమేజ్, గుర్తింపు జత కలిస్తే గెలిచే అవకాశాలు మరింత మెరుగవుతాయని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై వివిధ అంశాల ప్రాతిపదికన పలు దఫాలుగా బీజేపీ సర్వేలు నిర్వహిస్తోంది.
► రాష్ట్రంలో 12 ఎంపీ సీట్ల పరిధిలో మోదీ పాలన, పార్టీ పట్ల ప్రజల్లో మద్దతు 30 శాతానికి పైగా వ్యక్తం కాగా, ప్రజల్లో సొంతంగా పదినుంచి 15 శాతం సానుకూలత సాధించే బలమైన అభ్యరి్థకి టికెట్ ఇస్తే 8 నుంచి 10 దాకా కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు.
► మిగతా ఐదారు స్థానాల్లో పార్టీ పట్ల ప్రజల్లో 20 శాతం దాకా మద్దతు వ్యక్తం కాగా, ఆయా స్థానాలకు పోటీపడుతున్న పార్టీ అభ్యర్థుల్లో ఐదారు శాతమే సానుకూలత వ్యక్తం కావడంతో ఆ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పెట్టాలని నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం.
► పార్టీ అభ్యర్థులు అంతగా బలంగా లేని ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపీలు వస్తే గెలిచే అవకాశాలపై అన్వేషణ సాగిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఇతర పార్టీలకు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు ఓకే అంటే వారిలో బరిలో దింపేందుకు నాయకత్వం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.
► కొద్దిరోజుల క్రితం నగరశివార్లలో జరిగిన రాష్ట్రపార్టీ విస్తృత సమావేశంలో నిర్వహించిన అభిప్రాయసేకరణలో బీఆర్‌ఎస్ ఎంపీ రాములు చేరితే నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానాన్ని తప్పక గెలుచుకోగలుగుతామనే అభిప్రాయాన్ని పార్టీనాయకులు వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. పార్టీపరంగా సర్వేతో పాటు రాములు వస్తే విజయం సాధిస్తామనే అంచనాల నేపథ్యంలో ఆయనను చేర్చుకునేందుకు ముఖ్యనేతలు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.