
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా): సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఫ్లైట్ మోడ్ లోనే ఉంటాడంటూ విమర్శించారు కవిత. ఈరోజు(సోమవారం) కామారెడ్డి జిల్లా పర్యటలో భాగంగా బాన్సువాడలో ఆమె మాట్లాడారు. ‘బాన్సువాడ బీఆర్ఎస్ గడ్డ. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం ఉంటుంది. నేను, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి లాంటి వారం బాన్సువాడకు అండగా ఉంటాం. సీఎం రేవంత్ ది ఎప్పుడూ ఫ్లైట్ మోడే. అందుకే 15 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ చెప్పినట్లు వింటారు. 15 నెలలుగా జనాలు అష్టకష్టాలు పడుతుంటే రేవంత్ మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడతారు. క్రిస్టియన్ సోదరులకు, ముస్లిం సోదరులకు పండుగ బహుమతులు ఎత్తేశారు’ అంటూ విమర్శించారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం
‘తులం బంగారం అన్నారు.. అదీ లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. వీటిన్నంటిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. రేవంత్ దృష్టికి తీసుకెళ్లి ఇప్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్‌ఎస్ పార్టీ ముందుంటుంది. మీ పక్షాన నిలబడుతుంది.. మేము ఎప్పటికీ మీ వెంటనే ఉంటాం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.. రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో నెలకు ఒకటి చొప్పున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు ఈ ఘటనలపై రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలన్నా., ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీకి వెళ్లి పర్మిషన్ తీసుకోవాలే. రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం. ఆయన ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు.
జైనూర్ లో మూడు నెలలు ఇంటర్నెట్ బంద్ పెట్టారు. అక్కడ హిందూ ముస్లింల ఇండ్లను దహనం చేసినా ముఖ్యమంత్రికి వాటిపై సమీక్షించేంత తీరిక లేదు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని బంద్ చేసింది.. మైనార్టీల కోసం పెట్టిన బడ్జెట్ లో 25 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. ముస్లిం యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు కవిత.