Sakshi News home page

నేతన్నలపై ఎందుకీ కక్ష?: కేటీఆర్‌

Published Fri, Apr 5 2024 3:44 AM

BRS Leader KTR Letter To Congress Govt - Sakshi

ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ 

కార్మీకుల ఆత్మహత్యలను పట్టించుకోరా? 

వెంటనే బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వండి 

పాత బిల్లులు చెల్లించండి

సంక్షోభం తీవ్ర రూపం దాల్చక ముందే శాశ్వత పరిష్కారం చూపండి

సాక్షి, హైదరాబాద్‌: గత పదేళ్లుగా కళకళలాడిన చేనేత రంగం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే తిరిగి సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు విమర్శించారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో నేత కార్మీకులు ఉపాధి కోల్పోయారన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ లేఖ రాశారు. 

కార్మీకుల పొట్టకొట్టొద్దు..!: ‘ఉపాధి కోల్పోయిన నేత కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. రైతాంగ సంక్షోభం తరహాలో నేత కార్మీకుల సంక్షోభం తీవ్ర రూపం దాల్చక ముందే శాశ్వత పరిష్కారం చూపండి. గత ప్రభుత్వంపై కోపంతో నేత కార్మికుల పొట్ట కొట్టకుండా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూనే అదనపు సాయం అందేలా చూడండి. ప్రభుత్వ కక్షపూరిత వైఖరితో కార్మీకులు నేత పనికి దూరం కావడంతోపాటు పవర్‌ లూమ్స్‌కు ఆర్డర్లు లేక మూతపడ్డాయి.

ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో కార్మికులు రోజూ దీక్షలు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. నేత కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్‌ అనే నేత కార్మీకుడు ఉరేసుకొని చనిపోవడాన్ని ప్రభుత్వ హత్యగానే కార్మీకులు భావిస్తున్నారు’అని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. 

మా పాలనలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లిచ్చాం.. 
‘సమైక్య రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేత కార్మీకులను ఆదుకునేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నల వేతనాలు రెట్టింపు చేసి గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడటంతోపాటు చేనేత మిత్ర, నేతన్నకు చేయూత వంటి పథకాలను ప్రారంభించాం. రాజీవ్‌ విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్‌ కార్యక్రమాల ఆర్డర్లతో నేత కార్మీకులకు చేతి నుంచి పని కల్పించాం. బతుకమ్మ చీరల పథకం ద్వారా కార్మీకులకు చేతి నిండా పని దొరకడంతోపాటు కార్మీకులకు ఉపాధి పెరిగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాం.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు పోకుండా కొనసాగించడంతో పాటు బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిప జీవోను విడుదల చేయాలి. ఇది 35 వేల మంది కార్మీకులు, వారి కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్య కాబట్టి వెంటనే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. యార్న్‌ సబ్సిడీ విడుదల, చేనేత మిత్ర కొనసాగింపు, పరిశ్రమకు రావాల్సిన రూ. 270 కోట్ల బకాయిల విడుదల చేయాలి. కార్మీకులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తిపడి తమిళనాడు, సూరత్‌కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది’అని కేటీఆర్‌ లేఖలో ఆరోపించారు.   

Advertisement
Advertisement