రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో బాల్క సుమన్ తదితరులు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
ఆదిలాబాద్, భైంసాలలో మార్కెట్ యార్డుల సందర్శన.. రైతులతో ముఖాముఖి
భైంసా టౌన్/ఆదిలాబాద్ టౌన్: రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చావగొట్టా లని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్‌తోపాటు సోయా కొనుగోళ్లకు సంబంధించి బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. రైతులను కలవడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్ అంటూ నాటకాలు మొదలుపెట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రైతులతో రాజకీయాలు చేయొద్దు..
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో రాజకీయాలు చేయొద్దని... ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని సైతం కొనుగోలు చేసే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చించే వారని.. కానీ సర్కారు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై యాప్‌లను ఏర్పాటు చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనలేదు..
రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని కేటీఆర్ చెప్పారు. ఈసారి అధిక వర్షాలకుతోడు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ ఉంటుందని.. కానీ సీసీఐ మాత్రం 8 శాతం తేమ నిబంధన పేరిట ధరలో కోత పెడుతోందని ఆయన విమర్శించారు. రైతులు క్వింటాల్‌కు రూ. 2 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు చేయలేదన్నారు.
స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి తేమ నిబంధన 20 శాతానికి పెంచేలా చూడాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు 13 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేశామని.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకే పరిమితం చేశారని విమర్శించారు. తాము ఠంచన్‌గా రైతుబంధు, రుణమాఫీ, యూరియా బస్తాలు అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఏదీ సమయానికి అందక రైతులు ఆగం అవుతున్నారన్నారు.


