కర్ణాటక ఎఫెక్ట్‌.. కాంగ్రెస్‌తోనే ఫైట్‌! మారిన బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

BRS focus changed in wake of Karnataka elections results - Sakshi

రేపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక భేటీ 

అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశగా మార్గనిర్దేశనం 

వివిధ వర్గాలతో మమేకమయ్యేలా వినూత్న కార్యక్రమం రూపకల్పన  

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని అనూహ్యంగా మట్టికరిపించడంతో ఇక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తెలంగాణలో మతతత్వ రాజకీయాలు పనిచేయవనే నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలక భేటీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

మే 17న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ లెజిస్లేటరీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త భేటీ కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యంగా మారింది.  
 
ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేలా..  
జాతీయ, రాష్ట్ర రాజకీయాల స్థితిగతులను చర్చించడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే దిశగా ఈ సమావేశం ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశాన్ని సీఎం ఈ భేటీలో వివరించనున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించిన తీరుపైనా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్నీ వెల్లడించనున్నారు.

ఎన్నికల సమయానికి ప్రత్యర్థి పార్టీలను దిమ్మదిరిగేలా చేయడానికి పలు పథకాలను తమ వద్ద ఉన్నాయని సీఎం స్వయంగా ఒక సందర్భంలో ప్రకటించారు. సమావేశంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎలా సంసిద్ధం కావాలన్న అంశంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టనున్నట్లు పార్టీ వర్గాల కథనం. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడి నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు నెలలపాటు పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేసే అవకాశముంది. రాష్ట్ర రాజకీయాలపై వివిధ సర్వే సంస్థలతోపాటు ప్రభుత్వ నిఘా విభాగాల నివేదికలు కూడా అందిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్‌ మార్గదర్శనం చేయనున్నారు. 
 
వరుస కార్యక్రమాలతో బిజీబిజీ 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన అన్ని స్థాయిలకు చెందిన నేతలు చురుగ్గా పనిచేసేలా కేసీఆర్‌ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే రెండు నెలలుగా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలు ఈ నెలాఖరులోగా మిగతా సమ్మేళనాలను కూడా పూర్తి చేయాలని ఇదివరకే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.

జూన్‌ 1న అమరుల స్మారకం ఆవిష్కరణ, జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ వైభవంగా నిర్వహించేలా ఇప్పటికే కేసీఆర్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనాల తరహాలో నియోజకవర్గ స్థాయిలో యువజన, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

బుధవారం జరిగే భేటీలో యువజన, విద్యార్థి సమ్మేళనాల నిర్వహణకు సంబంధించి కేసీఆర్‌ పలు సూచనలు చేసే అవకాశముంది. వీటితోపాటు క్షేత్రస్థాయిలో వివిధ వర్గాలతో మమేకమయ్యేందుకు కేసీఆర్‌ వినూత్న కార్యక్రమాన్ని డిజైన్‌ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ వరకు ఈ కార్యక్రమం కొనసాగి, అక్టోబర్‌ 10న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల సమర శంఖారావం పూరించేలా కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. 
 
అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మళ్లీ బిల్లులు? 
ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో వైద్య విద్య సంచాలకులు, అదనపు సంచాలకులు, బోధనాసుపత్రుల ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్‌/డైరెక్టర్‌ బిల్లును గవర్నర్‌ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో మరోమారు పంపేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్‌ వర్సిటీల బిల్లులపై మరింత సమాచారం కావాలంటూ గవర్నర్‌ ప్రభుత్వానికి తిప్పిపంపిన సంగతి తెలిసిందే.

వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు, అటవీ విశ్వవిద్యాలయం బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. బుధవారం జరిగే భేటీలో వీటిని కూడా కేసీఆర్‌ ప్రస్తావించే అవకాశముంది. గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఉన్న ఫారూక్‌ హుస్సేన్, డి.రాజేశ్వర్‌రావు ఈ నెల 27న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు.

వీరి స్థానంలో కొత్తగా మండలికి ఎవరిని పంపాలనే అంశంపై గతంలోనే కేబినెట్‌ భేటీ నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసేందుకు ఈ వారాంతంలో కేబినెట్‌ భేటీ కూడా జరిగే అవకాశముందని పార్టీ చెప్పాయి.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top