‘రియల్‌ ఎస్టేట్‌ సభ’

Botsa Satyanarayana Slams TDP Chandrababu Over Raithu Yatra - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతిలో అమరావతి రైతుల పేరుతో టీడీపీ రాజకీయ సభ నిర్వహిస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది రైతుల సభ కానే కాదని, ముమ్మాటికీ టీడీపీ నిర్వహిస్తున్న రాజకీయ సభే అని స్పష్టం చేశారు. ఇంకా దోబూచులాట, దొంగాట ఎందుకు? టీడీపీ అజెండాతోనే సభ నిర్వహిస్తున్న విషయాన్ని చంద్రబాబు బహిరంగంగా చెప్పాలని సూచించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గ దోపిడీ కోసమే సభ తలపెట్టారని చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులది త్యాగమా? లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఇచ్చిన వారిది త్యాగమా? అని ప్రశ్నించారు. ఓ సామాజికవర్గం దోపిడీ కోసం చేస్తున్నది త్యాగమా?.. చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

ఒక్క రైతైనా వచ్చారా?
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలు మినహా మిగిలిన 13 జిల్లాలతో తమకు సంబంధం లేదని తిరుపతి సభలో చంద్రబాబు ప్రకటించగలరా? అని బొత్స ప్రశ్నించారు. ‘పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు మినహా స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతైనా వచ్చారా? టీడీపీ అజెండాతో, చంద్రబాబు అజెండాతో సభ నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు అంగీకరిస్తే బాగుండేది. సభను అడ్డుకునేందుకు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించడం హాస్యాస్పదం. పరిపాలనా రాజధానిగా విశాఖ వద్దని ఉత్తరాంధ్రవాసులు ఎవరు చెప్పారో వెల్లడించాలి. అల్లర్లు సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉందో ప్రజలు గమనించాలి. వారే అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అని బొత్స పేర్కొన్నారు.  

ప్రధాని ఏమన్నారో గుర్తుందా?
న్యాయస్థానం టూ దేవస్థానం అని పేరు పెట్టుకుని స్వీయ అభివృద్ధి కోసం పాదయాత్ర చేశారని బొత్స చెప్పారు. అమరావతి గురించి బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు సాక్షాత్తూ ప్రధానే అమరావతి ఒక అవినీతి కూపం అని, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని, రాష్ట్రపతి పాలన విధిస్తామనే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారు? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొత్స పేర్కొన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. పవన్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని  చెప్పారు. 13 జిల్లాల అభివృద్ధే తమ పార్టీ, ప్రభుత్వం విధానమన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top