పార్లమెంటు నిరవధిక వాయిదా

Both Houses of Parliament adjourned sine die, Monsoon session ends - Sakshi

షెడ్యూల్‌ కంటే రెండు రోజుల ముందే ముగిసిన సమావేశాలు 

ఓబీసీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్ర

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పెగసస్‌ స్పైవేర్‌ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సి ఉంది.

అయితే సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్‌సభలో 19 బిల్లులు పాసయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో  ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయసభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్‌సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22 శాతం మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగసస్‌పై చర్చకు పట్టుబట్టడం వంటి దృశ్యాలే ప్రతీరోజూ కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు.  

ఓబీసీ బిల్లుని ఆమోదించిన రాజ్యసభ
ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి ఈ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం కుల జనాభా గణన చేపట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు.

మార్షల్స్‌ మోహరింపు  
ఓబీసీ బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాజ్యసభలో గందరగోళం జరిగింది. జనరల్‌ ఇన్సూరెన్స్‌ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు మళ్లీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ రంగంలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి వీలు కల్పించే ఈ బిల్లును విపక్షసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగితాలు చింపి విసిరేశారు. మార్షల్స్‌తో ఎంపీలకు తోపులాట జరిగింది. మార్షల్స్‌ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు ఆరోపించారు. రెండుసార్లు వాయిదాపడ్డాక రాత్రి ఏడు తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా... టీఎంసీ, డీఎంకేలు దీన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేయగా ప్రభుత్వం తోసిపు చ్చింది. కాగా మంగళవారం సభ్యులు టేబుల్స్‌ పైకి ఎక్కి రభస చేయడంతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెల్‌లోనికి ఎవరూ రాకుండా 50 మంది మార్షల్స్‌ని మోహరించారు. ఇన్సూరెన్స్‌ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులు ఆమోదించాక సభ నిరవధికంగా వాయిదా పడింది.

కఠిన చర్యలు తీసుకోవాలి: జోషి
ప్రతిపక్ష సభ్యులే మార్షల్‌ను తోసివేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. మార్షల్‌ ఎంపీలను తాకే సాహసం చేయరని, సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలిసిపోతుందని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top