
కేసీఆర్ పథకాలు, పాలన మొత్తం ఫేక్ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు.
సాక్షి,ఢిల్లీ: కేసీఆర్ పథకాలు, పాలన మొత్తం ఫేక్ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చారని విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఉపఎన్నిక దృష్టిలో ఉంచుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి విస్మరించారన్నారు. హుజురాబాద్‌లో బీజేపీదే గెలుపు అని సర్వేలు చెబుతున్నాయని, కేసీఆర్ తప్పుడు ప్రచారం మానుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నడుపుతున్నారు: ధర్మపురి అరవింద్
ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నడుపుతున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ టికెట్లు కూడా కేసీఆరే ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ధర్నాలకు అనుమతివ్వరని ధ్వజమెత్తారు. ప్రగతిభవన్ ముట్టడి పేరుతో తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని అరెస్టులు చేసినా రేపటి ధర్నా కొనసాగుతుందని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు