రైతు గోస చూడండి | BJP leader Yeleti Maheshwar Reddy fires at Sarangpur Meeting | Sakshi
Sakshi News home page

రైతు గోస చూడండి

May 29 2026 4:01 AM | Updated on May 29 2026 4:01 AM

BJP leader Yeleti Maheshwar Reddy fires at Sarangpur Meeting

‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర సభలో మాట్లాడుతున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. వేదికపై కొమురయ్య, పాయల్‌ శంకర్, ఈటల, నితీశ్‌ రాథోడ్, రాకేశ్‌రెడ్డి, అంజిరెడ్డి, హరీశ్, వెంకటరమణారెడ్డి తదితరులు

80 శాతం ధాన్యం ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పండి

రేవంత్‌ సర్కార్‌ అబద్ధాలు చెబుతోంది 

రైతులను బాధపెట్టే ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతే లేదు  

సారంగపూర్‌ సభలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్‌ 

సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచే దమ్ము ఉందా? అని నిలదీత 

రాష్ట్రంలో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదన్న ఈటల 

ముగిసిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర

సారంగపూర్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు 80 శాతం ధాన్యం సేకరించామని రేవంత్‌ సర్కారు అబద్ధాలు చెబుతోందని.. ఆ 80 శాతం ఎక్కడ కొనుగోలు చేశారో చెబుతారా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతటి అబద్ధాలకోరు సర్కారును గతంలో ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. గాలిమోటార్లలో గాలి తిరుగుడు తిరిగి చెప్పడం కాదు.. గ్రామాల్లో రైతు గోస చూడాలని, పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలు చూడాలని డిమాండ్‌ చేశారు. రైతులను గోసపెట్టి, బాధపెట్టే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనేలేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవగలవా? అని ప్రశ్నించారు. ఒకవేళ గెలిచి చూపిస్తే తాను జీవితాంతం రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘రైతుగోస–బీజేపీ భరోసా’ యాత్ర తొలి విడత నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌లో గురువారం ముగిసింది. అంతకుముందు ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం మార్కెట్‌యార్డులో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించింది. రైతుల సమస్యలను తెలుసుకుంది. ఆ తర్వాత సాయంత్రం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏలేటి మాట్లాడారు. 

ప్రతి గింజ కొనుగోలు చేయాలి 
‘గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ ఖర్చులు, లారీ ఖర్చులు తామే భరించి పండించిన పంటలను విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? కనిపిస్తే కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలి. బీజేపీ చేసే రైతు భరోసా కార్యక్రమానికి భయపడి అక్కడక్కడా కొన్ని లారీలు, గన్నీబ్యాగులు సమకూర్చడం కాదు.. రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా కొనుగోలు చేయాలి..’ అని ఏలేటి డిమాండ్‌ చేశారు. 

దుర్భర పరిస్థితులు కాంగ్రెస్‌ ఘనతే..: ఈటల 
రైతులే గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ డబ్బులు అదనంగా చెల్లించి, లారీలు సైతం తామే నమకూర్చుకునేందుకు ముందుకు వస్తున్నా మార్కెట్లలో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. రైతాంగానికి ఇలాంటి దుర్భర పరిస్థితులు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ‘మూడు నెలల క్రితమే పంట చేతికి వస్తోంది.. ఆల్‌ పార్టీ మీటింగ్‌ పెడతారా..మీకు మీరే కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారా?.. అని కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను సంప్రదించాం. ఆ సమయంలో మాకు తెలువదా.. మేము ఎలా కొనాలో మీరు చెప్పాలా.. అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దురహంకారానికి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం..’ అని ఈటల ధ్వజమెత్తారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ సర్కారు వారిని ఏవిధంగా పట్టించుకుంటోందో చెప్పాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు, హమాలీ, లారీల ఖర్చులు తిరిగి ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతు కంట కన్నీరు పెట్టించే ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల శంకర్, పాల్వాయి హరీష్‌ మాట్లాడుతూ.. రైతులను క్షోభపెడితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. రైతు కన్నీరు కారిస్తే ఆ ఉసురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

కొనుగోలు కేంద్రాల సందర్శన..రైతులతో ముఖాముఖి 
నిర్మల్‌: ఏలేటి, ఈటలతోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణరెడ్డి, రామారావు పటేల్, రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులతో కూడిన బృందం నిర్మల్‌ జిల్లాలో పర్యటించింది. కడెం మండలం పెద్దూరుతండా, ఖానాపూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డు, మామడ మండలం పొన్కల్, సోన్, దిలావర్‌పూర్‌ మండల కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మామడ మండల కేంద్రం, పొన్కల్‌ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో నెల నుంచి ధాన్యం కుప్పలు ఇలాగే ఉంటున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని మహేశ్వర్‌రెడ్డి ఈ సందర్భంగా సంబంధిత అధికారిని ప్రశ్నించారు. రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తడుస్తున్న ధాన్యాన్ని చూస్తున్న రైతుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని, వాళ్లను చూస్తుంటే తమకూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement