‘బీజేపీ యాత్రతోనే మంత్రులు కల్లాల బాట పట్టారు’ | BJP Leader Eleti Maheswar Reddy Takes On TG Govt | Sakshi
Sakshi News home page

‘బీజేపీ యాత్రతోనే మంత్రులు కల్లాల బాట పట్టారు’

May 29 2026 6:08 PM | Updated on May 29 2026 6:18 PM

BJP Leader Eleti Maheswar Reddy Takes On TG Govt

హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు గోసం-బీజేపీ భరోసా పేరుతో రైతాంగం పడుతున్న బాధలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టామని, నాలుగురోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామన్నారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఎద్దేవా చేశారు.

‘ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. మా పర్యటనలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయి. మంత్రులు ఇవే సమీక్షలు, పర్యటనలు ముందే చేస్తే బాగుండేది కదా?, ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి. లారీ, హామాలీల ఖర్చు రైతే ఇస్తున్నాడు.. రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలెక్క మారిపోయారు. 

ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరీ, బుద్ధి మందగించింది కాబట్టే బీజేపీని విమర్శిస్తున్నారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు డిల్లీ యాత్రలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా?, బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది. 

మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెట్రోల్ డీజల్ పై అవగాహన లేదు. పెట్రోల్ డీజల్ పై 30 శాతం వ్యాట్ ను ఎందుకు ముఖ్యమంత్రి తగ్గించడం లేదు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా?.. ఎక్స్ గ్రేషియా ప్రకటించారా?, సన్ ప్లవర్, శెనిగలు కొంటున్నామని తుమ్మల చెబుతున్నారు.. మీ కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలి. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోంది. కేంద్రం కొనుగోళ్లు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయలేదా?’ అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement