
సాక్షి, ఏలూరు జిల్లా: వైయస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన దెందలూరు ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది. వైయస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన ఏలూరు కోర్టు.. విడుదలకు ఆదేశాలిచ్చింది.
వైయస్సార్‌సీపీ నేతలపై వేధింపులకు దిగిన కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని జైలుకు పంపుతానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కామిరెడ్డి నానితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరులు తేజ, ప్రదీప్‌లను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసిన రూరల్ పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. అయితే వీళ్లను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేకపోయారు. దీంతో నిన్నంతా ఏలూరులో హైటెన్షన్ నెలకొంది.
అయితే.. బెయిల్ మీద వ్యక్తిగత పూచీపై వీళ్ల విడుదలకు ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. అదే సమయంలో.. సిద్ధం సభ కేసు అంటూ పేర్కొనడాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించినందుకుగానూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రామకృష్ణకు మెమో జారీ చేసింది. సమన్లు ఇచ్చాకే కోర్టులో హాజరుపర్చాలని తీర్పు ఇచ్చింది. చింతమనేని సవాల్ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగిందనే చర్చ జోరుగా నియోజకవర్గంలో నడుస్తోంది.
