పదేళ్లు కేసీఆర్‌ దోపిడీ | Sakshi
Sakshi News home page

పదేళ్లు కేసీఆర్‌ దోపిడీ

Published Sun, May 12 2024 5:16 AM

Bhatti vikramarka comments over kcr

బీఆర్‌ఎస్‌ మునిగిపోతున్న ఓడ: మల్లు భట్టివిక్రమార్క 

దేశ సంపదను ప్రధాని అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారు  

అలంపూర్‌/గద్వాల/వనపర్తి: రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సంపదను దోపిడీ చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నా­రు. శనివారం నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా అయిజ, గద్వాల, పెబ్బేరులో రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎంతో పాటు ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశ సంపద మనకే చెందాలని రాహుల్‌గాంధీ పోరాటం చేస్తుంటే, మరోపక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని దుయ్య­బ­ట్టారు.

 పేదల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపిస్తారా లేక దేశ సంపదను కార్పొరేట్‌కు ధారాదత్తం చేస్తున్న మోదీకి ఓటు వేస్తారా ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ ఇప్పుడు కర్ర పట్టుకొని బయటికి వచ్చారని, బస్సులో అటూఇటు తిరుగుతూ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మాట్లాడు­తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో రాష్ట్ర సంపదను పేదలకు పంచడమే సర్వనాశనమా అని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచుతాం కానీ బీఆర్‌ఎస్‌లాగా దోపిడీ చేయబోమన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఒక మునిగిపోయే ఓడ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటు వేస్తే అదానీ, అంబానీ లాంటి వారికి దోచిపెడతారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మార్చి 1వ తేదీనే జీతాలు ఇచ్చిందని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ వేతనాలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పనిచేసే స్వీపర్ల బిల్లులు క్లియర్‌ చేసిందని చెప్పారు.

 పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పంట నష్టపోయిన ఒక్క రైతును కూడా ఆదుకోలేదని, కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పంట నష్టం అంచనా వేసి రైతులకు సాయం అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement