శశికళ నిష్క్రమణ వెనుక..

Behind V K Sasikala Departure AIADMK Leadership - Sakshi

భవిష్యత్తులో అన్నాడీఎంకే

పగ్గాలను దక్కించుకొనే ఎత్తుగడ

ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినా, ఓడినా చిన్నమ్మకు లాభమే

కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యే యత్నం

సాక్షి ప్రతినిధి, చెన్నై:  జింకను వేటాడేటప్పుడు పులి రెండు మూడు అడుగులు వెనక్కి వేసి, ఒక్కసారిగా ముందుకు లంఘించి నోట కరుచుకుంటుందట! తమిళనాడులో అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడానికి శశికళ ఇదే సూత్రం పాటిస్తున్నారేమో! రాజకీయాల నుంచి ఆమె నిష్క్రమణ వెనుక పెద్ద ఎత్తుగడ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జైలు నుంచి శశికళ విడుదల తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తుందని భావించారు. అలాంటిదేమీ జరగలేదు. అక్క కుమారుడు దినకరన్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమ్మ ముక్కల్‌ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ద్వారా జనంలోకి వెళ్లాలని ఆమె నిర్ణయానికొచ్చారు. ఇంతలో అన్నాడీఎంకే కూటమిలో చేరాలన్న ఆఫర్‌ బీజేపీ నుంచి వచ్చింది. దీన్ని అన్నాడీఎంకే అడ్డుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీ చేయాలన్న బీజేపీ షరతును దినకరన్‌ అంగీకరించలేదు. దినకరన్‌ వల్లనే అన్నాడీఎంకే నేతలు తనకు దూరమయ్యారన్న సమాచారం అందడంతో శశికళ అతడిని దూరం పెట్టడం ప్రారంభించారు. న్నికల్లో చురుకైన పాత్ర పోషించేందుకు అనుకూల వాతావరణం లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు.     

వ్యూహం అదే..
శశికళ ఏఎంఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరించి, అన్నాడీఎంకే, డీఎంకే కూటములను ఎదుర్కొని, అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఓట్లను చీల్చి, ఆ పార్టీకి ద్రోహం చేశారన్న అపవాదు తప్పదు. అందుకే తాత్కాలికంగా వెనక్కి తగ్గడమే మంచిదని శశికళ తీర్మానించుకున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే.. తనను ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టిన వ్యక్తులను క్షమించి, తన ఓటు బ్యాంకును వారికి అనుకూలంగా మళ్లించిన ఖ్యాతిని పొందవచ్చు. చిన్నమ్మ సహకారం వల్లనే గెలుపు అనే క్రెడిట్‌ కొట్టేయవచ్చు. ఒకవేళ అన్నాడీఎంకే ఓడిపోతే అది పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఖాతాలో పడిపోతుంది. దాంతో భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతికి రావొచ్చు. అన్నాడీఎంకే గెలిచినా, ఓడినా శశికళకు రాజకీయంగా లాభమే. అలాగే ప్రతిపక్ష డీఎంకేను  నిలువరించేందుకు సహకరించానంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చు. ఈ వ్యూహంతోనే శశికళ తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

దినకరన్‌ ఒంటరి పోరు!
శశికళ ప్రోద్బలంతోనే ఏఎంఎంకే ఆవిర్భవించింది. బీజేపీతో సఖ్యత కుదరకుంటే తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ 234 స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగేందుకు టీటీవీ దినకరన్‌ సన్నద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే– బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ముగిసే వరకు వేచి ఉండాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు.. శశికళ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్‌ చేస్తూ శశికళ పేరవై పేరిట మద్దతుదారులు చెన్నైలో ఆమె బస చేసిన ఇంటి ముందు గురువారం ధర్నా చేపట్టారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top