శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి 

Asaduddin Owaisi at AIMIM Foundation Day Meeting - Sakshi

ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవ సభలో అసదుద్దీన్‌ ఒవైసీ

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి.. మిగతా రాష్ట్రాల్లో సైతం పోటీ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు.

గురువారం హైదరాబాద్‌ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్‌ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్‌ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. 

గ్యాస్‌ సిలిండర్‌కు నమస్కారం పెట్టండి 
వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్‌ఖాన్‌ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా  ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు.

భారతదేశానికి చాయ్‌వాలా, చౌకీదార్‌ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్‌ పాషా ఖాద్రీ, అహ్మద్‌ పాషా ఖాద్రీ, జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్, కౌసర్‌ మోహియుద్దీన్, అహ్మద్‌ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top