
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అందరు సచివుల కంటె తాను కార్యవాది మంత్రిని అని చాటుకోవడానికి పాపం.. నారా లోకేష్ బాబుకు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్టుంది. టెక్నాలజీని వాడడంలో వేగం మాత్రమే కాదు, కార్యకర్తలు తమ కష్టాల్ని చెప్పుకుంటే వాటికి తక్షణం స్పందించడంలో కూడా తనను మించిన వారు లేరని చాటుకోవాలనే ఉబలాటం చాలానే ఉన్నట్టుంది.
ఓ కార్యకర్త నారా లోకేష్‌ను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టగానే, 20 నిమిషాల్లోగా మంత్రిగారు దానికి రెస్పాన్స్ ఇచ్చారు. సంబంధిత పోలీసుల్ని పనిమీద పురమాయించేశారు. న్యాయం చేయాలని, తనకు అప్ డేట్ చేయాలని ఎక్స్ లో హుకుం విడిచారు. చూడబోతే.. ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయమన్న పెద్దమనిషి ఆత్రుత గురించి మన పెద్దోఆల్లు సామెతలు తయారుచేశారు. కానీ లోకేష్ వ్యవహార సరళిని గమనిస్తే.. ‘ఎద్దు ఈనిందంటే.. సాయంత్రం ఇంటికి జున్నుపాలు పంపు..’ అని అడిగే చందంగా కనిపిస్తున్నారు.
Please look into this issue @appolice100. Kindly follow up @officeofNL and keep me updated. https://t.co/558zUiBWA5
— Lokesh Nara (@naralokesh) September 4, 2025
ఇంతకూ ఈ కామెడీ ఎపిసోడ్ తాలూకు కథా కమామీషూ ఏంటంటే...
‘‘అన్నా @naralokesh గారు. నా పేరు రోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును YCPకి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే గత సంవత్సరంగ నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్న స్పందన లేదు .దయచేసి నా కారు నాకు ఇప్పించండి.నాకు అదే జీవనాధారం.’’ అంటూ ఎవరో ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు.
లోకేష్ వెంటనే పోలీసులను ట్యాగ్ చేసి, ఈ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘‘ఈ సంగతేంటో చూడండి.. ఏ సంగతి ఎప్పటికప్పుడు నాకు చెప్పండి’’ అని ట్వీటు వేసేశారు. ఇదంతా సదరు రోజిబాబు ట్వీటు పెట్టిన 20 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఒక మామూలు వ్యక్తి ట్వీటుకు మాననీయ మంత్రి వర్యులు అంత వేగంగా స్పందిస్తే సంతోషించాలి గానీ.. విమర్శ ఎందుకు? అనిపించవచ్చు. అక్కడే ఉంది తమాషా!.
సదరు రోజిబాబు.. ట్విటర్ అకౌంటు పెట్టుకున్నదే ఈ సెప్టెంబరు నెలలో.. అనగా ఇవాళ గత రెండురోజుల్లోనో మాత్రమే. ఆయన ఖాతాలో ఉన్నది ఇదొక్కటే ట్వీటు! ఆయన ఇలా పెట్టడమూ వెంటనే మంత్రి స్పందించడమూ.. ఏదో ముందే స్క్రిప్టు ప్రకారం జరిగిన కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
ఈ పోస్టు కింద కామెంట్లలో స్పందిస్తున్న నెటిజన్ల జోరు గమనిస్తే... చినబాబుకు బహుశా జ్ఞాననేత్రం తెరచుకోవాల్సిందే! ఆ రోజిబాబు అకౌంటును గంట ముందే క్రియేట్ చేసుకుని పోస్టు పెడితే.. అప్పుడే స్పందనా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా డీసీఎం పోస్టు నువ్వే తీసుకోరాదా అంటున్నారు. తల్లికి వందనం రాలేదని, ఉద్యోగాలు అడిగినా గానీ స్పందించరు గానీ.. వైసీపీ వాళ్లు కారు లాక్కున్నారనగానే.. ముందూ వెనకా చూసుకోకుండా చర్యలకు పురమాయించడమేనా అని కొందరు అడుగుతున్నారు. మహానాడుకు వచ్చినప్పుడు నా ఫోను పోయింది సార్.. సీకె దిన్నె పోలీసులకు ఫిర్యాదుచేసినా దిక్కులేదు.. తమరు ఇప్పించండి అంటూ దాసరి రామకృష్ణారెడ్డి అనే తెదేపా సీనియర్ కార్యకర్త అంటున్నారు. సుగాలి ప్రీతి తల్లి విలాపం విషయంలో ఈ వేగవంతమైన స్పందన ఎక్కడికెళ్లిందని అంటున్నారు.



మొత్తానికి ఒక్క ట్వీటు ద్వారా.. నారా లోకేష్ అభాసు పాలైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే.. ఒకరు ఒక ఫిర్యాదు చేస్తే అందులో ఉండే న్యాయబద్ధత గురించి తెలుసుకుని స్పందించడం విజ్ఞుల విధానం. అలా కాకుండా.. నింద వైసీపీ వారి మీద ఉన్నది కదా అని.. చర్యలకు ఉపక్రమిస్తూ రెచ్చిపోయి స్పందిస్తే ఇలా అభాసుపాలు కావల్సిందేనని అంతా అనుకుంటున్నారు. పీఆర్ స్టంటులను, స్ట్రాటజీలను తగలెయ్యా అని జనం ఆడిపోసుకుంటున్నారు.
నేరుగా మొరపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరని, వినతిపత్రాలు రాసుకుంటే బుట్టదాఖలు అవుతాయని, ట్వీట్ల రూపంలో అయితే సోషల్ మీడియా క్రేజ్ కోసం స్పందిస్తారని.. పాపం ఆ జోజిబాబుకు కూటమి నేతల మీద ఒక నమ్మకం ఉంటే తాను ఖాతా క్రియేట్ చేసుకుని తొలిపోస్టుగానే ఈ నింద పెట్టడం తప్పేమీ కాదు. కొత్త ఖాతా అయినంత మాత్రాన, ఒకటే పోస్టు ఉన్నంత మాత్రాన మంత్రి స్పందించకూడదని కూడా లేదు.
కానీ.. ఇలాంటి నిరాధార నిందలు రోజుకు కొన్ని వేలు కూడా వస్తుంటాయి. నిరాధారంగా వేసే నిందల పట్ల కూడా మహా వేగం స్పందించేస్తే అభాసుపాలు కావాల్సిందే. ఒకవేళ జోజిబాబు ఆరోపణ నిజమే అయితే.. వైసీపీకి చెందిన వ్యక్తి కారు లాక్కోవడానికి ఎలాంటి కారణం ఉన్నదో ముందు తెలుసుకోవాలి. సదరు జోజిబాబు పోలీసుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతున్నా ఎందుకు పని జరగలేదో తెలుసుకోవాలి. ఒకవేళ అదంతా నిజమే అని తేలితే.. ఏడాదిరోజులుగా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తారా? కూడా లోకేష్ తేల్చి చెప్పాలి. అంతే తప్ప.. వైసీపీ అనే పదం కనపడగానే.. బురద చల్లుడుకు వీలుగా ఉన్నదని ఇలా రెచ్చిపోయి స్పందిస్తే నవ్వులపాలవుతారు. ఎద్దు ఈనిందంటే.. జున్నుపాలు తెమ్మన్నంత మేధావిగా కొత్త సామెతలు పుట్టడానికి కారకులవుతారని చినబాబు తెలుసుకోవాలి.
:::ఎం. రాజేశ్వరి