ఈ పదవి రేపు ఉంటుందో లేదో నాకు తెలియదు: అజిత్ పవార్ 

Ajit Pawar Maharashtra Politics NCP Bjp Shivsena Cant Say - Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైరుహాజరవ్వడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. 

పూణేలోని బారామతిలో ఇదే రోజున సహకార రంగానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ రంగానికి సంబంధించిన సంస్థలు షుగర్ మిల్లులు ఆర్ధికంగా బలపడాలని చెబుతూనే.. ఈరోజు నేను ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్నాను. రేపు ఈ పదవి ఉంటుందో లేదో నాకు తెలియదని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేయాంతో అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వాలతో ఏమైనా చెడిందా ఏంటనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 

పూణే కార్యక్రమంలో తన పదవిపై అనిశ్చితిని వ్యక్తం చేసిన ఆయన అమిత్ షా కార్యక్రమానికి గైర్హాజరవడంపైన కూడా స్పందించారు. ఈ రోజు నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అమిత్ షా కార్యాలయానికి ముందుగానే తెలిపానని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు రాష్ట్రానికి విచ్చేసిన అమిత్ షా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ గృహాలకు వెళ్లి గణేషుడిని దర్శించుకున్నారు.  

ఇటీవల అజిత్ పవార్ విద్యాసంస్థల్లో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార భాగస్వాములు బీజేపీ, శివసేన సుముఖంగా లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కానీ మరో విషయంలో కానీ అధికార పార్టీతో అజిత్ పవార్‌కు సత్సంబంధాలు ఉన్నంతవరకే ఉనికి ఉంటుందని.. అదే గనుక బెడిసికొడితే అజిత్ పవార్ బృందం పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారే ప్రమాదముందని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు.  

ఇది కూడా చదవండి: ఈ ఎన్నికల్లో హామీలకు 'మోదీ గ్యారెంటీ' 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top