Pankaja Munde: మీరు మోసపోలేరు.. సీఎంను కలుస్తా

Marathas Feel Cheated Over Job Quota: Pankaja Munde - Sakshi

ముంబై: రిజర్వేషన్లపై మరాఠాలు మోసపోయామని భావిస్తున్నారని కానీ, ప్రస్తుత తరం ప్రజలు మోసపోలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే వ్యాఖ్యానించారు. గురువారం తన తండ్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్‌ ముండే ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె వర్చువల్‌ ర్యాలీలో ప్రసంగించారు. ఉద్ధవ్‌ను త్వరలోనే కలుస్తానని, రిజర్వేషన్ల అంశంపై తన సలహాలు, సూచనలు సీఎంకు అందజేస్తానని పంకజ తెలిపారు.

విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో మరాఠాలు మోసపోయామని అనుకుంటున్నారని, కానీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏ వర్గాల కోసం ప్రణాళిక రూపొందిస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌చేశారు. ఓబీసీ, మరాఠా రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.

కాగా, బీడ్‌ జిల్లా పార్లీ నుంచి 2019లో ఎదురైన ఓటమిపై ఆమెను ప్రశ్నించగా ఎన్నికల నష్టం రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిలిచిపోదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికీ తన ఓటమి గురించి మాట్లాడుతారని కానీ, ఆ ఓటమి పూర్తి స్థాయిలో లేదన్నారు. ప్రజలకు తనపై ఇంకా ఆశలు ఉన్నాయని, గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం ఇస్తానని పంకజా తెలిపారు.

కాగా, 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల వరకు రిజర్వేషన్లకు ఎలాంటి అడ్డంకి రాలేదు. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్‌ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 

చదవండి:
మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్‌ వ్యాఖ్యలు దుమారం

జీరో కరోనా కేసులు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top