జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

● క్లిష్టమైన లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స విజయవంతం

కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) వైద్యులు జిల్లాలోనే తొలిసారి అత్యాధునిక ఐపీవోఎం(పొత్తికడుపు పొరలో వచ్చే హెర్నియా సమస్య) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గోదావరిఖనికి చెందిన దీప(27) కడుపునొప్పితోపాటు బొడ్డు భాగంలో ఉబ్బుగా కనిపిస్తోందని జీజీహెచ్‌ను ఆశ్రయించింది. వైద్యులు పరీక్షించగా బొడ్డు భాగం పొరలో హెర్నియా సమస్య ఉన్నట్లు తేలింది. ఈనెల 1న ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని వైద్య పరీక్షలు చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం అత్యాధునిక లాపరోస్కోపిక్‌ విధానంలో ఐపీవోఎం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. మంగళవారం డాక్టర్లు మంజూష, అనిల్‌కుమార్‌ పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతమైంది. వైద్యుల్లో లుబ్నా, సందీప్‌, శుభమ్‌, కిరణ్‌తోపాటు ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. మత్తుమందు విభాగాధిపతి లక్ష్మీనర్సయ్య నేతృత్వంలో డాక్టర్లు శ్రీనివాస్‌, దినేశ్‌, సంజన, తేజస్విని పేషెంట్‌కు మత్తుమందు సేవలు అందించారు. సాధారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే ఈ తరహా శస్త్రచికిత్స చేస్తారు. దీనిని జీజీహెచ్‌లో విజయవంతంగా పూర్తి చేయడం విశేషమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోనే తొలిసారి ఈ విధమైన శస్త్రచికిత్స నిర్వహించడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాభాయి, దండె రాజు తదితరులు వైద్య బృందాన్ని అభినందించారు. ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement