శాతవాహన గాథలు–2
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీలో దళితులపై అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుమారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో వైస్ చాన్స్‌లర్ వర్గం, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాతల వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైస్ చాన్స్‌లర్‌కు అనుకూలంగా కొందరు పీహెచ్‌డీ స్కాలర్స్ ముందుకు వస్తుండగా.. ఫ్రొఫెసర్ సుజాతకు దళిత సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అండగా నిలుస్తున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలో వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై చర్చ జరగాలంటూ, అవసరమైతే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
వింత నిర్ణయాలపై విస్మయం
క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలపై ఇటు సిబ్బంది, అటు విద్యార్థులు మండిపడుతున్నారు. సీసీ టీవీల్లో పరిశీలిస్తూ వీసీ పలువురు విద్యార్థులు, సిబ్బందిని నేరుగా తన చాంబర్‌కు పిలిపిస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లో 800మంది విద్యార్థులు ఉంటే దాదాపు 200కుపై సీసీ కెమెరాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి క్యాంటీన్‌లోనూ ఆడియో రికార్డ్ చేసే కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిసెంబరు మొదటివారంలో హాజరుశాతం, లైబ్రరీ పనివేళలపై ఆంక్షలపై క్యాంపస్‌లో వందలాది విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. పదే పదే పోలీసులను క్యాంపస్‌లోకి తీసుకువచ్చి తమలో భయానక వాతావరణ సృష్టిస్తున్నారని విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వీసీ ఉమేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. క్యాంపస్‌లో సీసీ కెమెరాలు కేవలం విద్యార్థుల భద్రత కోసమే ఏర్పాటు చేశాం. వర్సిటీలో వేధింపులు, అక్రమాలు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం కేవలం నిరాధారం’ అని ఖండించారు.
ఎస్‌యూ క్యాంపస్‌లో సీసీ కెమెరాల ద్వారా నియంత్రణ
క్యాంటీన్‌లోనూ ఆడియో రికార్డింగ్ కెమెరాలు
హాజరు శాతం, లైబ్రరీ నిబంధనలపై కన్నెర్ర
వీసీ వింత నిర్ణయాలపై విద్యార్థుల ఆగ్రహం
విచారణ జరగాలంటున్న విద్యార్థి సంఘాలు


