కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆ కుంభంకోణం జరగగా.. కరెంట్ అకౌంట్లు పొంది సైబర్‌నేరాల్లో పాలుపంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్‌బీఎల్ బ్యాంకులో కరెంటు ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), క్యాషియర్ నగరానికి చెందిన చెందిన ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్‌కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్‌డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు గుర్తించారు. ఈ కేసు లో మొత్తం 24 మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన కరీంనగర్ టౌన్ ఏ సీపీ వెంటకస్వామి, సీఐలు తిరుమ ల్, సృజన్‌రెడ్డి, రాంచందర్రా వు, సరిలాల్‌ను సీపీ అభినందించారు.
కమీషన్లకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు సాయం
ఆపరేషన్ క్రాక్‌డౌన్ ద్వారా గుట్టు రట్టు
13 మందిని అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం


