గోదావరిఖని: వాట్ నెక్ట్‌స్? బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తగ్గించడమా? పెంచడమా? అనేదానిపై సింగరేణి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యం భారీగా తగ్గడంతో వార్షిక లక్ష్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నేపత్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సింగరేణి సీఎండీ.. అధికారులతో అధ్యయనం చేస్తున్నారు.
కొత్తగనులు లేక.. నిల్వలు తగ్గి..
కొత్త బొగ్గు గనులు రాకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో వచ్చే ఏడాదిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎలా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలనే లక్ష్యం నిర్దేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యం కాగా.. గడువులోగా 60 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం 56.75 మిలయన్ టన్నులే సాధించి 81 శాతం నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అన్నిఏరియాల్లోని కార్మికులు మరోనాలుగు రోజులపాటు శ్రమిస్తే 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే వాస్తవ టార్గెట్ 72 మిలియన్ టన్నులు చేరుకోవడం గగనమే అంటున్నారు.
లాభాలు సాధించడం కష్టమే..
ఈసారి సింగరేణి లాభాలు భారీగా ఆర్జించడం కష్టమేనని అధికార వర్గాలు నిర్మొహమాటంగా చెబుతున్నాయి. వాస్తవానికి ఈఏడాది భారీగా బొగ్గు ఉత్పత్తి సాధించినా.. గత లోటు పూడ్చేందుకు.. ఉత్పత్తి చేసిన బొగ్గులోంచి కోత విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈఎఫెక్ట్ ఈఏడాది బొగ్గు ఉత్పత్తిపై చూపుతోంది. బొగ్గు ఉత్పత్తి రానప్పుడు లాభాలు, లాభాల వాటా ఎలా వస్తుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో ఈఆర్థిక సంవత్సరంలో లాభాల వాటా విషయంలో కార్మికులకు నిరాశమిగులుతుందని అంటున్నారు.


