భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు

Mar 25 2026 6:56 AM | Updated on Mar 25 2026 6:56 AM

గోదావరిఖని/జ్యోతినగర్‌: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్‌ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) చందన్‌ కుమార్‌ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్‌, 500 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్‌లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్‌–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు.

ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు..

థర్మల్‌ ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌, 10 మెగావాట్ల గ్రౌండ్‌ మౌంట్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్‌, 56 మెగావాట్లు ఫ్లోటింగ్‌) సోలార్‌ ప్రాజెక్టులు కమిషనింగ్‌కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్‌ నుంచి ఫస్ట్‌ టైమ్‌ చార్జింగ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్‌ ప్రాజెక్టు 13.4 బిలియన్‌ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్‌–1 ప్రాజెక్టు 9.3 బిలియన్‌ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్‌ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

పర్యావరణ హిత చర్యలు పటిష్టం

విద్యుత్‌ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్‌ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్‌ యూనిట్‌, కార్బనేటెడ్‌ బ్రిక్స్‌ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్‌జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్‌జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్‌ మేనేజర్లు ముకుల్‌ రాయ్‌, మనీష్‌ అగర్వాల్‌, అభిజిత్‌ దత్తా, బినోయ్‌ జోస్‌, తెలంగాణ ప్రాజెక్టు హెచ్‌వోడీ డీఎస్‌ రావత్‌, ఏజీఎం బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌, సీఎస్సార్‌ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

సోలార్‌, థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాల పెంపు

వేసవి డిమాండ్‌కు ముందస్తు ఏర్పాట్లు

సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు

రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్‌ కుమార్‌ సామంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement