ఓటుహక్కే అవ్వ ఆయుధం
కోల్‌సిటీ(రామగుండం): పేరు కోడూరు మధునమ్మ. వయసు 90 ఏళ్లు. అడుగులు నెమ్మదిగా పడుతున్నా.. మనసులో ప్రజాస్వామ్యంపై అచంచలమైన నమ్మకం. ఓటుహక్కు వినియోగించుకోవాలన్న సంకల్పంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆ వృద్ధురాలు యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన ఈ అవ్వ.. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, శారీరక అలసటలను లెక్కచేయకుండా బ్యాలెట్ పట్టుకుని మరీ ఓటు వేసిన ఆమె తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఓటు వేయడం నా బాధ్యత’ అన్న భావనతో ఆమె చూపిన చైతన్యం అక్కడున్న యువ ఓటర్లను ఆలోచింపజేసింది. ఈ దశ్యం ప్రజాస్వామ్యంలో ప్రతీఓటు ఎంతవిలువైనదో మరోసారి గుర్తుచేసింది. వయసుతో సంబంధం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని ఈ 90 ఏళ్ల వృద్ధురాలు తనఓటుతో బలంగా చాటి చెప్పారు.
90 ఏళ్ల వయసులోనూ ప్రజాస్వామ్యానికి సెల్యూట్


